Adipurush Trailer : ప్రభాస్ గురి తప్పలేదు, బాక్సాఫీస్ కుంభస్థలమే టార్గెట్ - 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చిందోచ్!
Adipurush Trailer Review : 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత చాలా ట్రోల్స్ వచ్చాయి. ట్రైలర్ తర్వాత అటువంటి కామెంట్స్ రావని చెప్పవచ్చు. ఈసారి ప్రభాస్ గురి తప్పలేదని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
బహుశా 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన ట్రోల్స్ ఇతర సినిమాల టీజర్లు విడుదలైనప్పుడు రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు కూడా ఆ టీజర్ నచ్చలేదు. 'ఆదిపురుష్' ట్రైలర్ (Adipurush Trailer) విషయంలో అటువంటి విమర్శలు వచ్చే అవకాశం లేదని చెప్పాలి. ఈసారి ప్రభాస్ గురి తప్పలేదని అనుకోవాలి. రాఘవ రామునిగా బాక్సాఫీస్ కుంభస్థలానికి ఆయన గురి పెట్టారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో సోమవారం ప్రభాస్ అభిమానులకు ట్రైలర్ ప్రత్యేకంగా చూపించారు. ఈ రోజు మీడియాకు ప్రసాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్‌లో మధ్యాహ్నం 01.53 గంటలకు ట్రైలర్ ప్రదర్శించారు.
శ్రీరామ చంద్రునిగా ప్రభాస్ నటించిన చిత్రం 'ఆదిపురుష్' (Adipurush Movie). ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ జోడీగా, జానకి అలియాస్ సీత దేవిగా కృతి సనన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న త్రీడీలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'ఆదిపురుష్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Adipurush Trailer Review : మర్యాదా పురుషోత్తముడు అయిన రాముడు, మర్యాదకు విరుద్ధమైనది ఏదీ చేయలేదని, కనుసైగ చేస్తే పోరాటం చేసే సమస్త సైన్యం ఉన్నప్పటికీ... సీతాదేవి ప్రాణం కంటే మర్యాదకు శ్రీరామచంద్రమూర్తి ఎక్కువ విలువ ఇచ్చారని 'ఆదిపురుష్' ట్రైలర్ ద్వారా దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. వానర సైన్యాన్ని వెంట బెట్టుకుని సీత కోసం ఆయన చేసిన యుద్ధాన్ని కూడా చూపించారు.
శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు... అన్ని పాత్రలకూ ట్రైలర్ లో సమ ప్రాధాన్యం లభించింది. 'రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనుస్సు విరిచాడు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి' అని సీతా దేవి చెప్పిన డైలాగ్... తన కోసం భర్త ఏదైనా చేస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.
'నా కోసం పోరాడకు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అహకారం రొమ్ము చీల్చి... ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అని శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్ వింటుంటే... అభిమానులకు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. లంకేశుడు రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ట్రైలర్ చివరలో కనిపించినా... క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
Also Read : విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!
'ఆదిపురుష్'లో రెండు సాంగ్స్ టీజర్స్ ఆల్రెడీ విడుదల చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా 'జైశ్రీరాం, నీపై నమ్మకమే మా బలం' సాంగ్ టీజర్, సీతా నవమి సందర్భంగా ఏప్రిల్ 29న 'రామ్ సియా రామ్' (Ram Siya Ram) సాంగ్ ఆడియో టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడీ సినిమా పాటల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
Also Read : 'విరూపాక్ష' విజయంతో సత్యం రాజేష్ రెండో 'పొలిమేర'కు పెరిగిన క్రేజ్!
'ఆదిపురుష్'లో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. జూన్ 7 నుంచి 18వ తేదీ వరకు జరిగే ప్రతిష్టాత్మక ట్రిబెకా చలన చిత్రోత్సవాల్లో జూన్ 13వ తేదీన 'ఆదిపురుష్' ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు.