Hansika: అవన్నీ చెత్త వార్తలు, హార్మోన్ ఇంజెక్షన్ల ఆరోపణలపై ఎట్టకేలకు నోరు విప్పిన ఆపిల్ బ్యూటీ!
హీరోయిన్ గా ఎదిగే సమయంలో పెద్ద అమ్మాయిలా కనిపించేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుందనే వార్తలపై హన్సిక స్పందించారు. అవన్నీ చెత్త వార్తలుగా కొట్టిపారేశారు. తల్లిపైనా ఆరోపణలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేసింది.
ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా మారింది. తాజాగా ప్రేమికుడు సోహైల్ ను పెళ్లి చేసుకుంది. జైపూర్ వేదికగా అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకు ప్రస్తుతం ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో తన ప్రేమ, పెళ్తితో పాటు కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈనేపథ్యంలోనే హీరోయిన్ గా మారే సమయంలో హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు గతంలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించారు. ఆ వార్తలన్నీ చెత్త వార్తలుగా ఆమె కొట్టి పారేశారు.
అప్పట్లో హార్మోన్ ఇంజెక్షన్లు తీస్తున్నట్లు వార్తలు!
నిజానికి హన్సిక్ చైల్డ్ ఆర్టిస్టుగానే కెరీర్ మొదలు పెట్టింది. 2003లో హృతిక్ రోషన్ హీరోయిన్ గా నటించిన ‘కోయి మిల్ గయా’లో చిన్నారిగా కనిపించింది. అనంతరం ‘జాగో’, ‘హమ్ కౌన్ హై’, ‘అబ్రక దబ్ర’ సినిమాల్లోనూ బాలనటిగా అలరించింది. 2007లో పూరి జగన్నాథ్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. బాలనటిగా కనిపించిన తర్వాత నాలుగైదు ఏండ్లలోనే హీరోయిన్ గా ఎదగడంపై అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. యుక్తవయసు అమ్మాయిగా కనిపించేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు వార్తలు వెల్లువెత్తాయి. ఆ వార్తలపై అప్పట్లో హన్సిక గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ స్పందించలేదు. ఎన్ని వార్తలు వచ్చినా తను మాత్రం తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
అవన్నీ చెత్త వార్తలు- హన్సిక
తాజాగా ‘లవ్ షాదీ డ్రామా’లో హన్సిక, ఆమె తల్లి హార్మోన్ ఇంజెక్షన్ల వార్తలపై స్పందించారు. “ఆ వార్తలన్నీ అసత్యాలు. నేను హీరోయిన్ గా మారడం వల్లే ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు నాకు 21 ఏండ్లు. ఆ సమయంలోనూ ఇలాంటి చెత్త వార్తలు రాశారు. అప్పట్లో ఆ ఇంజెక్షన్లు తీసుకుంటే, ఇప్పటికీ తీసుకోవాల్సి ఉండేది. అంతేకాదు, నేను ఎదగడానికి తన తల్లే ఈ ఇంజెక్షన్లు ఇచ్చిందని వార్తలు రాశారు. అవన్నీ పచ్చి అబద్దాలు” అని హన్సిక కొట్టి పారేశారు. ఈ వార్తలపై హన్సిక తల్లి కూడా స్పందించారు. “నా కూతురుకు హార్మెన్ ఇంజెక్షన్లు ఇవ్వాలనుకుంటే నేను మిలియనీర్ల కన్నా ధనవంతురాలినై ఉండాలి. అసలు ఇలాంటి వార్తలు, ఎలా సృష్టిస్తారో అర్థం కావట్లేదు. మేం పంజాబీలం. 12 నుంచి 16 ఏండ్ల వయసులోనే మా ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు. ఆ విషయం తెలియక ఎన్నో కల్పిత వార్తలు రాశారు” అని చెప్పారు. పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాలు చేస్తున్నారు. ‘పార్ట్‌నర్’, ‘105 మినిట్స్’ సినిమాల షూటింగ్ పూర్తి అయ్యింది. ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Read Also: స్క్రిప్ట్ చదువుతూ చాలాసార్లు ఏడ్చాను - ‘RSS’ స్టోరీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!