Kabzaa 2: ఫ్లాప్ సినిమాకు పార్ట్ 2 - సీఎం చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ రిలీజ్!
Kabzaa 2: ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'కబ్జా'. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించబడింది.
Kabzaa 2: ఇండియన్ సినిమాలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక మూవీ హిట్టయిందంటే చాలు, వెంటనే పార్ట్ 2 మీద డిస్కషన్స్ స్టార్ట్ పెట్టడం సర్వ సాధారణమైపోయింది. కొందరు మాత్రం హైప్ కోసం పార్ట్ -1 రిలీజ్ అవ్వకముందే సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు. సినిమా సక్సెస్ ఐతే సీక్వెల్ చేద్దాం, ఫ్లాప్ అయితే ప్రాజెక్ట్ పక్కనపెట్టేద్దాం అనే విధంగా ముందుకి సాగుతున్నారు. అయితే దీనికి పూర్తి భిన్నంగా ఓ భారీ డిజాస్టర్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. అనౌన్స్ చేయడమే కాదు, ఏకంగా సీఎం చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ విడుదల చేయించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలై, బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల లిస్టులో ఒకటిగా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్ లోనూ 'కేజీఎఫ్' చిత్రాన్ని కాపీ కొట్టి తీశారనే విమర్శలు ఎదుర్కొంది. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దర్శక నిర్మాత ఆర్ చంద్రు తన RC స్టూడియోస్ బ్యానర్ పై ఒకేసారి 5 పాన్ ఇండియా సినిమాలు తీయడానికి సంకల్పించారు. మరో రెండు సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్ట్స్ పై రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని బెంగుళూరు వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్లడించారు. దీనికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్యతో పాటు, హీరోలు ఉపేంద్ర & సుదీప్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'కబ్జా-2: వార్ బిగిన్స్' చిత్రాన్ని సగర్వంగా ప్రకటించారు.
Also Read: మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దేవిశ్రీ - అర డజనుకు పైగా సినిమాలతో రాక్ స్టార్ ఫుల్ బిజీ
Happy to announce my next 5 ventures through my new production house R C STUDIOS pic.twitter.com/iZnVhJSwdU
— R.Chandru (@rchandru_movies) January 23, 2024
నిజానికి 'కబ్జా -1' రిలీజ్ టైంలోనే పార్ట్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేసారు. అయితే భారీ బడ్జెట్ తో తీసిన సినిమా తీవ్ర నష్టాలను మిగల్చడంతో, సీక్వెల్ ఉండదని అందరూ భావించారు. కానీ ఆర్. చంద్రు మాత్రం మొదటి భాగం డిజాస్టర్ గా మారినా సరే, ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కూడా సీక్వెల్ తెరకెక్కించడానికి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొన్న డైరెక్టర్.. ఈసారి ఉపేంద్రను మరింత కొత్తగా ప్రెజెంట్ చేస్తానని చెబుతున్నారు. మరి 'కబ్జా 2' ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.
'కబ్జా' పార్ట్ -1లో ఉపేంద్ర సరసన శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించింది. శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించగా, తాన్య హోప్ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. మురళీ శర్మ, కోట శ్రీనివాస్, పోసాని కృష్ణ మురళి, సుధ, కబీర్ దుహన్ సింగ్, నవాబ్ షా, దేవ్ గిల్, జాన్ కొక్కెన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. KGF ఫేమ్ రవి బసృర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. మహేష్ రెడ్డి ఎడిటింగ్ చేసారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ సినిమాస్ బ్యానర్స్ పై ఆర్. చంద్రు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: 'పుష్ప 2' To 'సలార్ 2'.. టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఢీకొట్టబోయే క్రేజీ సీక్వెల్స్ ఇవే!