Siren: కీర్తి సురేష్ - జయం రవి మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారా?
Siren: జయం రవి, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘సైరన్’, ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ప్రచారంలో ఉంది.
Siren: కోలీవుడ్ హీరో జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరన్ 108’. ఇందులో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అభిమన్యుడు, విశ్వాసం, హీరో వంటి పలు చిత్రాలకు రైటర్‌గా పని చేసిన ఆంటోని భాగ్యరాజ్.. ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. కానీ గతేడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ మీదకు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'పొన్నియన్ సెల్వన్' సినిమా తర్వాత జయం రవి నుంచి వస్తున్న చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సైరన్’ సినిమా పైనా అందరిలో ఆసక్తి నెలకొంది. హీరో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని తమిళంతో పాటుగా తెలుగులోనూ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆ సమయంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా జయం రవి ట్వీట్ చేస్తూ.. ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా చెప్పిన టైంకి రాలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎట్టకేలకు డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది.
Also Read: తెలుగులోనూ విజయ్ సేతుపతి, కత్రినాల 'మేరీ క్రిస్మస్' - సస్పెన్స్ థ్రిల్లర్‌తో 'అంధాధున్' డైరెక్టర్!
తమిళ మీడియా కథనాల ప్రకారం, 'సైరన్' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. Zee5 ఓటీటీలో రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26న తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబడుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కోవిడ్ పాండమిక్ టైంలో చాలా సినిమాలు నేరుగా డిజిటల్ రిలీజ్ అయ్యాయి కానీ, ఇటీవల కాలంలో మాత్రం మేకర్స్ అందరూ థియేట్రికల్ విడుదలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇప్పుడు జయం రవి లాంటి స్టార్ హీరో సినిమా డైరెక్ట్ ఓటీటీలోకి వస్తోందని వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
'సైరన్' అనేది ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఒక రివేంజ్ డ్రామా. టీజర్ లో అంబులెన్స్ డ్రైవర్ అయిన జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు. అతను పెరోల్ పై విడుదలైన తర్వాత తనని జైలుకు పంపించిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో జయం రవి తొలిసారిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తీ సురేష్ నటించగా.. అనుపమ ఓ కీలక పాత్ర పోషించింది. సముద్రఖని, యోగి బాబు, తులసి, కౌశిక్ మెహతా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్ కుమార్ - అనూష విజయ్ కుమార్ భారీ బడ్జెట్‌తో 'సైరన్' చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. సెల్వ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. త్వరలోనే నిర్మాతలు ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజకి సోలో రిలీజ్ దక్కేనా?