సిటీకి దూరంగా, ఫ్యామిలితో కలిసి చిరంజీవి బర్త్ డే వేడుకలు
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాాబాద్ కు దూరంగా ఈ వేడుకలను నిర్వహించుకున్నారు.. బన్నీ మాత్రం ఈ వేడుకలకు హాజరు కాలేదు..
మెగాస్టార్ చిరంజీవి.. 67వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఆయన బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు తెగ హంగామా చేశారు. సోషల్ మీడియాలో ఓ రేంజిలో సందడి చేశారు. ఆయనకు హ్యాపీ బర్త్ డే చెప్తూ పోస్టుల మీద పోస్టులు పెట్టారు. నిన్నటి నుంచి చిరు బర్త్ డే కు సంబంధించిన కోలాహలం కొనసాగుతూనే ఉంది. అభిమానులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే.. మరికొన్ని చోట్ల సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తంగ ఫ్యాన్స్ పెద్ద పండుగలా చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.
అటు చిరంజీవి మాత్రం హైదరాబాద్ కు దూరంగా తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా తనే వెల్లడించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు చిరు ఓ ట్వీట్ చేశారు. “ఈ పుట్టిన రోజును నా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా జరుపుకున్నాను. కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలు అద్భుతం” అని వెల్లడించారు.
ఈ సందర్బంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తన మనవళ్లు, మనవరాళ్లతో చిరు ఆడుకుంటూ కనిపించారు. మరో ఫోటోలో ఆయన మెగా ఫ్యామిలీ కనిపించింది. చిరంజీవి భార్య సురేఖ, చిరు కుటుంబ సభ్యులు, అటు అల్లు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ మినహా మిగతా కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఇక అల్లు హీరో బన్నీ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నాడు. ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లాడు. న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఆయనతో పాటు తన సతీమణి స్నేహ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నది. అయితే ఈ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం ఇష్టం లేకనే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు అనే టాక్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.
గడిచిన కొంత కాలంగా బన్నీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. అల్లు అర్జున్ అంటూ స్పెషల్ బ్రాండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరో అని పిలిపించుకోవడం ఇష్టం లేకనే ఆయన సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన మెగా ఫ్యాన్స్ అధ్యక్షుల సమావేశంలో అల్లు అర్జున్ ను వేరు చేసిన మాట్లాడారట. మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించారట. అటు బన్నీ జనసేనకు సహకరించడం లేదని ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. త్వరలో పుష్ప-2 సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. బన్నీ అమెరికా నుంచి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
This birthday, I have been with family away from the city and spent some wonderful time together! #BlissfulMoments #FamilyTime pic.twitter.com/cXvDhyZlEk
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2022