Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్‌లో పెత్తనమంతా ఇక కొత్త కంటెస్టెంట్లదే - పాతవారికి దబిడి దిబిడే, గౌతమ్ భలే లక్కీ
బిగ్ బాస్ సీజన్ 7లోకి కొత్తగా అయిదుగురు కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇలా హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే అలా వారి చేతికి పవర్స్ ఇచ్చారు నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్ వల్ల హౌజ్‌లో ఎనిమిది మందే మిగిలారు. ఈ విధంగా చూస్తే.. బిగ్ బాస్ మరో మూడు వారాల్లో ముగిసిపోవాల్సిందే. అందుకే బిగ్ బాస్ సీజన్ 7కు 2.0 వర్షన్ అంటూ మరో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు మేకర్స్. ఇప్పటివరకు ఏ భాషలోని బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా అయిదుగురు ఒకేసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఒకరి తర్వాత ఒకరు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే శివాజీ సైతం ఆశ్చర్యపోయారు. ఎంతమంది వస్తారు ఇంకా అంటూ టేస్టీ తేజతో కలిసి నవ్వుకున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లోకి కొత్తగా వచ్చిన అయిదుగురు ఎవరంటే..
అర్జున్ అంబటి
బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ అంబటి. ఇప్పటికే సీరియల్ హీరోగా తను బుల్లితెర ప్రేక్షకులలో విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. హౌజ్‌లోకి ఎంటర్ అయ్యే ముందు దమ్ములాగా ఆడే ఇద్దరు కంటెస్టెంట్స్, దుమ్ములాగా ఆడే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమని అడిగారు నాగార్జున. దానికి అర్జున్.. దమ్ము కేటగిరిలో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌ల పేర్లు చెప్పాడు. ఇక దుమ్ము కేటగిరిలో అమర్‌దీప్, సందీప్‌లను పెట్టాడు. అమర్‌దీప్.. తన స్నేహితుడే అయినా.. అలా ఆడతాడని ఊహించలేదని అన్నాడు అర్జున్. ఇక అర్జున్‌ను కంటెస్టెంట్‌గా చూసి తెగ ఆశ్చర్యపోయాడు అమర్‌దీప్.
అశ్విని శ్రీ
అర్జున్ అంబటి తర్వాత హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న అశ్విని గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అయినా కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పింది. చదువుల విషయంలో చరుగ్గా ఉండేదనని నాగార్జునతో కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత హౌజ్‌లోకి ఎంటర్ అయ్యింది. అర్జున్, అశ్విని.. ఇద్దరూ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వారిద్దరినీ హోస్ట్ ఆఫ్ లగేజ్‌లను చేశారు నాగార్జున. అంటే ఇకపై హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లగేజ్ బాధ్యత ఈ ఇద్దరిదే అని, ఎవరి వస్తువుల పోకుండా జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు.
భోలే షావలి
బయట మంచి సింగర్‌గా ప్రవేట్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్నాడు భోలే షావలి. అలాగే బిగ్ బాస్ స్టేజ్‌పైకి కూడా పాట పాడుతూనే ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత నాగార్జునపైన ఒక పాట పాడి తనను ఇంప్రెస్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే ముందు భోలే షావలికి ఒక సలహా ఇచ్చారు నాగార్జున. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ముందు వారిని మాట్లాడనివ్వాలని అన్నారు. ఆ తర్వాత హౌజ్‌లోకి ఎంటర్ అయిన షావలి.. వెళ్లగానే తన పాటతో కంటెస్టెంట్స్‌ను ఇంప్రెస్ చేశాడు.
పూజా మూర్తి
బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్‌లోనే పూజా మూర్తి కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అవ్వాల్సింది. కానీ తన తండ్రి హఠాన్మరణం వల్ల అప్పుడు హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్‌ను తను వదిలేసుకుంది. ఇక ఈ సీజన్ మొదలయ్యి అయిదు వారాలు పూర్తవ్వడంతో ఇప్పుడు హౌజ్‌లోకి ఎంటర్ అవ్వాలని పూజా మూర్తి నిర్ణయించుకుంది. వెళ్లే ముందు కూడా తన తండ్రిని గుర్తుచేసుకుంటూనే వెళ్లింది. ముందుగా తను హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే తన సీరియల్ ఫ్రెండ్స్ అంతా పలకరించారు.
నయని పావని
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇప్పటికీ నయని పావనికి చాలా పాపులారిటీ ఉంది. ఇక బిగ్ బాస్‌లోకి వచ్చి తన పాపులారిటీని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది ఈ భామ. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో తనకు ముందు నుండే కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వెళ్లగానే ఎక్కువగా వారితోనే సమయం గడిపే ప్రయత్నం చేసింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నీ పూర్తయిన తర్వాత భోలే షావలి, పూజా మూర్తి, నయని పావనిలను హోస్ట్ ఆఫ్ బెడ్స్‌గా ప్రకటించారు నాగార్జున. ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారంతా కన్ఫర్మ్ హౌజ్‌మేట్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటినుండి హోస్ట్ ఆఫ్ బెడ్స్ చేతిలోనే ఎవరు ఎక్కడ పడుకోవాలని నిర్ణయం ఉంటుందని అన్నారు. దీంతో ముందు నుండి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మనసులో అసూయ మొదలయ్యింది.
Also Read: కొన్ని గంటల్లో ‘బిగ్ బాస్’, ఇంతలో నాన్న చనిపోయారనే వార్త - పూజా మూర్తి భావోద్వేగం