Pallavi Prashanth Arrest: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్!
బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు జరిగిన గొడవ విషయంలో పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా.. తనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ ఏ1గా ఉన్నాడు. గజ్వేల్ మండలం కొల్గూరులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశాంత్‌ను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ తరువాత ఫ్యాన్స్ వార్ నడిచింది. కొందరు ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రశాంత్ సోదరుడు రఘురాజ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
వీడియో విడుదల చేయగానే..
బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల ఇప్పటివరకు ఎన్నో ఫ్యాన్ వార్స్ జరిగాయి. ఒక్కొక్కసారి ఆ ఫ్యాన్ వార్స్ లిమిట్స్ దాటాయి కూడా. కానీ బిగ్ బాస్ సీజన్ 7 విషయంలో మాత్రం పలువురు ఫ్యాన్స్ విచక్షణ కోల్పోయి కంటెస్టెంట్స్‌పై దాడిచేశారు. అమర్‌దీప్, అశ్విని, గీతూ కార్లను ధ్వంసం చేయడంతో పాట ఆర్టీసీ బస్సులు, పోలీస్ కారుపై కూడా దాడి చేయడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుండి పల్లవి ప్రశాంత్‌ను వెతుకుతున్నామని, కానీ తను పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు అని పల్లవి ప్రశాంత్.. ఒక వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు తనను అరెస్ట్ చేశారు.
సీపీఐ నారాయణ సీరియస్..
ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై తన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కేవలం తను విన్నర్ అయితే చూడాలని, తనను కలవాలని ఫైనల్స్ రోజు చాలామంది అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఎదురుచూశారు. అలాంటిది అరెస్ట్ అయ్యాడని తెలిస్తే.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తారో అని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు.. కంటెస్టెంట్స్‌పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. సీపీఐ నారాయణ ఈ విషయంపై స్పందిస్తూ.. పల్లవి ప్రశాంత్‌ను తన ఆఫీసుకు రమ్మని, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ అంతలోపే అరెస్ట్ జరిగిపోయింది.
బిగ్ బాస్ నిర్వహకులపై కేసు పెట్టాలి..
బిగ్ బాస్ మ్యానేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలా జరిగిందని.. అందుకే బిగ్ బాస్ నిర్వహకులపై, నాగార్జునపై కేసు నమోదు చేయాలని, పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి, తనను అరెస్ట్ చేయడం అన్యాయమని ఇప్పటికే పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ అనే రియాలిటీ షో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని ఎంతోమంది సామాజిక కార్యకర్తలు దీని బ్యాన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌లో జరిగిన రచ్చ వల్ల మరోసారి ఈ రియాలిటీ షో బ్యాన్ గురించి పలువురు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. అందులో హైకోర్ట్ న్యాయవాది అరుణ్ కూడా ఒకరు. బిగ్ బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలంటూ అరుణ్.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.