Bhaag Saale Trailer: కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నువ్వు నాకు అంత ఇష్టం - ఫన్నీగా ఫన్నీగా ‘భాగ్ సాలే’ ట్రైలర్!
శ్రీసింహ హీరోగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భాగ్ సాలే'. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా 'భాగ్ సాలే'. ప్రణీత్ సాయి దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా పతాకాలపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఫుల్ ఫన్, యాక్షన్ సన్నివేశాలతో అలరిస్తోంది.
ఫుల్ ఫన్నీగా ‘భాగ్ సాలే’ ట్రైలర్
‘భాగ్ సాలే’ ట్రైలర్ ఫ్యామిలీ ట్రీతో షురూ అయ్యింది. జమిందారీ ఫ్యామిలీ గురించి ఆ చెట్టు ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాడు వైవా హర్ష. అటు హీరో శ్రీ సింహ చెఫ్ గా పని చేస్తుంటాడు. అతడిని హీరోయిన్ తన తండ్రికి రాయల్ ఫ్యామిలీకి చెందిన యువకుడిగా పరిచయం చేస్తుంది. పైసల కోసం కాయ కష్టం చేసే అతడిని బిజినెస్ మ్యాన్ అని చెప్తుంది. “నీ మార్కెట్ క్యాప్ ఎంత?” అని హీరోయిన్ తండ్రి అడగడంతో “క్యాప్ ఎందుకు అంకుల్? జుట్టు బాగానే ఉందిగా” అని చెప్పే మాట ఫుల్ ఫన్నీగా అనిపిస్తుంది. ఫుడ్ అనేది ఎప్పుడూ రన్నింగ్ లో ఉండే బిజినెస్ అంటూ తల్లింద్రులకు చెప్తాడు హీరో. అందుకే తాను చెఫ్ గా మారినట్లు వివరిస్తాడు. “నేనంటే నీకు ఎంత ఇష్టం?” అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకు, “తెలంగాణ అంటే కేసీఆర్ కు ఎంత ఇష్టమో? నువ్వు అంటే నాకు అంతే ఇష్టం అని చెప్తాడు”.ఇక ఈ సినిమా మొత్తం కథ ఉంగరం వెనుకే తిరుగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ఒక ఉంగరం మెయిన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ ఉంగరం కథేంటో తెలియాలంటే త్వరలో విడుదల కానున్న సినిమా చూడాలి.
క్రైమ్ కామెడీ కథతో రూపొందుతున్న ‘భాగ్ సాలే’
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రణీత్ కీలక విషయాలు వెల్లడించాడు. ఇదొక క్రైమ్ కామెడీ కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా అని చెప్పారు. ఈతరం ప్రేక్షకులను అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీగా 'భాగ్ సాలే' సినిమా రూపొందిందని నిర్మాత అర్జున్ దాస్యన్ వివరించారు. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్రలో హీరో శ్రీ సింహా కోడూరి కనిపిస్తారన్నారు. సినిమా ఆద్యంతం థ్రిల్ కలిగిస్తుందన్నారు. ఈ సినిమాలో నేహా సోలంకి ఫిమేల్ లీడ్ గా కనిపించబోతోంది. రాజీవ్ కనకాల, సుదర్శన్, హర్ష చెముడు, జాన్ విజయ్ కీలకపాత్రలు పోషించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మించింది. కాల భైరవ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జులై 7న విడుదల కాబోతోంది.
Read Also: తెలుగు పాటలు వింటూ జిమ్‌లో అకిరా వర్కౌట్స్ - కొడుకును చూసి మురిసిపోతున్న రేణూ దేశాయ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial