Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో
సిల్వర్ స్క్రీన్ మీద నటనతో మాత్రమే కాదు... మైదానంలో ఆటతోనూ అరవింద్ కృష్ణ పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన బాస్కెట్ బాల్ ప్లేయర్. లేటెస్టుగా ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్‌లో పాల్గొన్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆరడుగుల అందగాళ్ళు ఎవరు? అని చూస్తే... యువ హీరో అరవింద్ కృష్ణ (Aravind Krishna Actor) కూడా కనిపిస్తారు. హీరోగా మాత్రమే కాదు... అప్పుడప్పుడూ స్నేహం కోసం ఇతర యువ హీరోల సినిమాల్లో తళుక్కుమని మెరుస్తారు కూడా! తెలుగు చిత్రసీమలో హీరోగా తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న అరవింద్ కృష్ణ... మరోవైపు ఆటల్లో కూడా రాణిస్తున్నారు.
అరవింద్ కృష్ణ... బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా!
అరవింద్ కృష్ణ నటుడు మాత్రమే కాదు... స్పోర్ట్స్ పర్సన్ కూడా! ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఆయన! ప్రస్తుతం ఓ సూపర్ హీరో మూవీలో నటిస్తున్న ఆయన... మరో వైపు బాస్కెట్ బాల్ టోర్నమెంట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఒక వైపు సినిమా చిత్రీకరణలు చేస్తూ... మధ్యలో విరామం లభించినప్పుడు ఎంతో ప్రతిషాత్మకమైన 'ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్' లీగ్ (FIBA)లో పాల్గొన్నారు. జపాన్‌లో గత వారం సాగామిహర 3BL లీగ్ నిర్వహించింది FIBA. ఇందులో ఒక్కొక్క టీమ్ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ పాల్గొంటారు. మన హైదరాబాద్ టీమ్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ ఎవరో కాదు... అరవింద్ కృష్ణ! పలు దేశాల నుంచి టీమ్స్ ఈ లీగ్ లో పాల్గొన్నాయి. అందులో అరవింద్ కృష్ణ టీమ్ క్వాలిఫైయర్స్‌కి ఎంపికైంది. ఈ లీగ్‌లో తదుపరి గేమ్స్‌ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు.
ఐపీఎల్ క్రికెట్ ఎలాగో... 3BL బాస్కెట్ బాల్ అలాగ!
ఇండియా నుంచి FIBA ఈ చాంపియన్ లీగ్ పోటీల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడు మన తెలుగు హీరో అరవింద్ కృష్ణ కావటం విశేషం. ''ఐపీఎల్ క్రికెట్ తరహాలో బాస్కెట్ బాల్ (Basketball)లో 3BL లీగ్ అలాగ. ముగ్గురు ఆటగాళ్లతో పాటు ఓ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఉంటారు. ఇలాంటి ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్‌లో పాల్గొనటం ఎంతో గర్వంగా, గౌరవంగా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాకు ఈ 3BL లీగ్ మంచి బ్రేక్ అనొచ్చు. ఇది నాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది'' అని అరవింద్ కృష్ణ చెప్పారు.
Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'అడవి కాచిన వెన్నెల', ఋషి' తదితర సినిమాల్లో అరవింద్ కృష్ణ హీరోగా నటించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'ప్రేమమ్', మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' తదితర సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అరవింద్ కృష్ణ హీరోగా నటించిన 'గ్రే : ది స్పై హూ లవ్డ్ మి' సినిమా ఈ ఏడాది విడుదలైంది. అలాగే, 'సుడిగాలి' సుధీర్ హీరోగా నటించిన 'కాలింగ్ సహస్ర'లో ఆయన కీలకమైన అతిథి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆయనది ఆన్ స్క్రీన్ హీరో రోల్. ప్రజెంట్ 'ఏ మాస్టర్ పీస్' అనే సూపర్ హీరో మూవీలో అరవింద్ కృష్ణ నటిస్తున్నారు.
Also Read: జెర్సీ నుంచి హాయ్ నాన్న వరకు... నాని లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!