Love Again trailer: ‘లవ్ ఎగైన్’ ట్రైలర్: ప్రియాంక చోప్రా మూవీలో భర్త నిక్ - లిప్ లాక్‌తో షాకిచ్చిన జంట
ప్రియాంకా చోప్రా లేటెస్ట్ మూవీ ‘లవ్ ఎగైన్’ ట్రైలర్ విడుదలైంది. మే 12న విడుదల కానున్న ఈ సినిమాలో.. కోల్పోయిన ప్రేమను పొందేందుకు ఆరాటపడే యువతి పాత్రలో ప్రియాంక కనిపించింది.
అందాల తార ప్రియాంక చోప్రా నటించిన తాజా రొమాంటిక్ చిత్రం ‘లవ్ ఎగైన్’. జేమ్స్ సి స్ట్రౌస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సామ్ హ్యూఘన్, సెలిన్ డియోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. మే 12న థియేటర్లలోకి అడుగు పెట్టనున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ చాలా బాగుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక భర్త నిక్ జోనాస్ అతిథి పాత్రలో అలరించనున్నాడు.
అందరి చూపు ప్రియాంక - నిక్ పైనే..
ఈ ట్రైలర్‌లో, ప్రియాంక తన జీవితంలో కోల్పోయిన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న యువతి పాత్రలో కనిపిస్తోంది. తన ప్రియుడు ఉపయోగించిన ఫోన్ కు వరుసగా మెసేజ్ లు పంపుతూనే ఉంటుంది. అయితే, తను ఉపయోగించే నంబర్ మరో వ్యక్తి వాడుతాడు. ఆమె పంపించే మెసేజ్ లు తనకు వెళ్తాయి. తొలుత పట్టించుకోకపోయినా, ఆ తర్వాత ఆమె సందేశాలకు ఆకర్షితుడవుతాడు. ఆమెను అతడు కలుస్తాడా? లేదా? అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ఈ ట్రైలర్ లో నిక్, ప్రియాంక లిప్ లాక్ సీన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇద్దరూ కనిపించేది కొద్ది క్షణాలే అయినా, అందరి చూపు వారి మీదే పడింది.
చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ ను మెచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఈ ట్రైలర్ లో కనిపించే నిక్ జోనాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రంలో తను క్యామియో రోల్ లో కనిపించినా, చాలా రొమాంటిక్ గా ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు. "క్వాంటికో x ఆమె నిజ జీవిత భర్త x సెలిన్ డియోన్ వాట్ ఇన్ ఎ మల్టీవర్స్” అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం - ప్రియాంక చోప్రా
హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంకా చోప్రా. వరుస సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో టాప్ ఏషియన్ స్టార్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ ట్రైలర్ ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ కీలక విషయాలు వెల్లడించింది. "మేము ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా కుటంబ సభ్యులు, బంధుమిత్రులకు దూరంగా ఈ షూటింగ్ లో పాల్గొన్నాం. సెట్స్ లో మాత్రం చాలా సరదగా ఉండేవాళ్లం. నా సహ నటులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు” అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
Read Also: కన్నీటిని దిగమింగి, కెమేరా ముందుకు - అరుదైన వ్యాధులతో బాధపడుతున్న మన తారలు వీరే!