Sunny Deol: ‘రామాయణ్‘లో హనుమంతుడిగా సన్నీడియోల్, రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
Sunny Deol: నితీష్ కుమార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ్‘లో సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Sunny Deol As A Hanuman: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ్‘. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లి, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, కైకేయిగా లారా దత్తా నటించబోతున్నారు. ఈ సినిమా గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలు కాగా, చిత్రీకరణ మార్చిలో మొదలయ్యే అవకాశం ఉంది. ‘రామాయణ్‘ సినిమాను మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్
ఇప్పటికే ‘రామాయణ్‘ సినిమాలో కీలక పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన దర్శకుడు నితీష్, తాజాగా ‘హనుమంతుడి‘ పాత్రకు సైతం స్టార్ యాక్టర్ ను ఫిక్స్ చేశారట. ఇన్ని రోజులు ఈ సినిమాలో ఆంజనేయుడిగా నటించేది ఎవరు? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. వారందరికీ క్రేజీ న్యూస్ అందించారు డైరెక్టర్. గతంలో బాలీవుడ్ లో హనుమంతుడు అనగానే ధారాసింగ్ గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు ఆ పాత్రకు సన్నీ డియోల్ ను ఓకే చేశారు దర్శకుడు. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించే అవకాశం అరుదుగా లభించనున్న నేపథ్యంలో సన్నీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించి మే నెలలో షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.
భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సన్నీ
ఇక సన్నీ డియోల్ ‘హనుమంతుడి‘ పాత్రను పోషించేందుకు ఓకే చెప్పినా, పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన నటించి ‘గదర్ 2‘ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ మూవీ హిట్ తర్వాత ఆయన తన రెమ్యునరేషన్ ను పెద్ద మొత్తంలో పెంచారు. ఒక్కో సినిమాకు రూ. 70 కోట్లు అడుగుతున్నారట. ఇక ‘రామాయణ్‘లో హనుమంతుడి పాత్రను పోషించేందుకు గాను ఆయన రూ. 45 నుంచి రూ. 50 కోట్లు తీసుకుంటున్నారట. ఈ సినిమా చేసే వరకు మరే సినిమా చేయనని కూడా చెప్తున్నారట. పెద్ద మొత్తం అయినప్పటికీ, మేకర్స్ సైతం సన్నీని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
Also Read: హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏమిటో తెలుసా?
మార్చి నుంచి షూటింగ్, 2025 దీపావళికి విడుదల
నితీష్ తివారి ‘రామాయణ్‘ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం అంతర్జాతీయ వీఎన్స్ కంపెనీ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ DNEG ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ, మే చివరి నాటికి తొలి భాగం షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. జూలై నాటికి ఈ సినిమా తొలి భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు. ఈ పనుల కోసం సుమారు ఏడాదిన్నర సమయం పడుతుందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 దీపావళి నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాముడి పేరు మార్మోగుతున్నది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు మేకర్స్.
Read Also: మహాభారత శాపాలు ఈ జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే? - ‘హ్యాపీ ఎండింగ్’ కథ చెప్పేసిన దర్శకుడు కౌశిక్