Amirkhan in Kakinada : కాకినాడలో అమీర్ ఖాన్.. అమలాపురంలో లాల్ సింగ్ చద్దా షూటింగ్..!
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం కాకినాడ వచ్చారు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వచ్చారు. అక్కడి ఓ హోటల్లో బస చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల పాటు అమలాపురం సముద్రతీర ప్రాంతాల్లో జరగనుంది. అందు కోసమే ఆయన వచ్చారు. గురువారం రాత్రి కాకినాడ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో షూటింగ్‌లో పాల్గొంటారు. కొద్ది రోజులుగా అమలాపురం ప్రాంతంలో సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ.. ఏ సినిమా అన్నదానిపై గోప్యంగా ఉంచారు. అమీర్ ఖాన్ కాకినాడకు వచ్చిన తర్వాతనే అక్కడ లాల్ సింగ్ ద్దా సినిమా షూటింగ్ జరుగుతుందని బయటకు తెలిసింది.
ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్ బాలాగా కనిపించగా ఆమిర్ లాల్ సింగ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నాగచైతన్య ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకాలం ఈ సినిమా షూటింగ్ జమ్మూకాశ్మీర్ లడక్ లో జరిగింది. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమీర్ ఖాన్ కి ‘మిష్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరు ఉంది. ఓ జవాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమాలోతెలుగు రాష్ట్రాలకు చెందిన జవాన్ ప్రస్తావన కూడా ఉంటుందని తెలుస్తోంది. నాగ చైతన్య తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకుడిగా... సైన్యంలో పని చేస్తూ లాల్ సింగ్‌కు స్నేహితునిగా వ్యవహరిస్తూంటారని.. ఈ క్రమంలో కీలకమైన సన్నివేశాలు ఇద్దరి మధ్య ఉంటాయన చెబుతున్నారు. అయితే అమలాపురం ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో నాగచైతన్య లేనట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం గోదావరి జిల్లాలో బాలీవుడ్ సినిమా షూటింగ్ జరగడంతో స్థానిక ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. షూటింగ్‌ను చూసేందుకు ..అమీర్‌ఖాన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన యూనిట్ .. పెద్ద ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. అభిమానుల వల్ల షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.
ఏ సినిమా చేసినా వంద శాతం ఎఫర్ట్ పెట్టే అమీర్ ఖాన్.. లాల్ సింగ్ చద్దా మూవీ కోసం కూడా లుక్ మార్చారు. సైనికుడికి తగ్గట్లుగా ఫిట్‌గా మారారు. ఇటీవల ఆయన భార్య కిరణ్‌రావుకు విడాకులు ఇవ్వడంతో వార్తల్లోకి వచ్చారు. మరో హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాము ఇష్టపూర్వకంగానే విడిపోయామని.. గొడవల్లేవని కిరణ్ రావు, అమీర్ ఖాన్ ఇద్దరూ వీడియో విడుదల చేశారు. కారణాలు మాత్రం చెప్పలేదు.