Avatar Crazy Facts: అవతార్ 2కు ఎందుకంత క్రేజ్ - ఈ 10 విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ పక్కా!
అవతార్ 2కి అంత క్రేజ్ ఎందుకో తెలుసా?
సినిమా తీసి కంప్యూటర్ లో దాన్ని ప్రాసెస్ చేయటం కామన్. కానీ ఓ సినిమా కోసం 5 సూపర్ కంప్యూటర్లు తయారు చేశారని... అవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లుగా తొలి 200 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయని మీకు తెలుసా. ఇలాంటివి అవతార్ విషయంలో చాలానే జరిగాయి. మనం లెక్కపెట్టలేనని విశేషాలు, గుర్తుపెట్టుకోలేనన్ని వింతలు అన్నీ కలిస్తేనే అవతార్ ఫ్రాంచైజీ. పదమూడేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ రిలీజ్ చేసిన అవతార్ సృష్టించిన సంచలనాలనే ఇప్పటివరకూ మరే సినిమా అందుకోలేకపోయింది. ఇప్పుడు మీ వల్ల కాదా నేనే వస్తానంటూ అవతార్ 2 వచ్చింది. అసలు ఈ సినిమాకు సంబంధించి టాప్ 10 విశేషాలు ఏంటో ఓ సారి చూద్దాం.
1. ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిందే!
పదమూడేళ్ల తర్వాత అవతార్ 2 సినిమా వస్తోంది. అవతార్ 1 కోసం పెట్టిన బడ్జెట్ 237 మిలియన్ డాలర్లు అంటే సుమారు 2వేల కోట్ల రూపాయలు. అంటే మన బాహుబలి కలెక్షన్లు అవతార్ 1 బడ్జెట్ అన్నమాట. కానీ అవతార్ సాధించిన కలెక్షన్లు దాదాపుగా 23వేల కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అవతార్ కలెక్షన్లను కొట్టిన సినిమానే లేదు. మధ్యలో అవెంజర్స్ ఎండ్ గేమ్ పోటీకి వచ్చినట్లు కనిపించినా...అవతార్ రీ రిలీజ్ కావటంతో తిరిగి సింహాసనాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు అవతార్ 2 కి పెట్టిన బడ్జెట్ 250 మిలియన్ డాలర్లు అంటే మూడువేల కోట్ల రూపాయలు . కానీ ఇప్పుడు అవతార్ 2 పై ఆధారపడి ఉన్న బిజినెస్ అంతా లాభాల్లోకి వెళ్లాలంటే అవతార్ 2 కనీసంలో కనీసం 16 వేల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాలి. అది చాలా పెద్ద టార్గెట్ అయినా అవతార్ ఆల్రెడీ చేసి చూపించింది కాబట్టి పార్ట్ 2 మీద కూడా కామెరూన్ నమ్మకంతో ఉన్నారు.
2. అవతార్ 1 మామూలు రికార్డులు కాదు
2009 లో అవతార్ రిలీజ్ అయ్యే టైం కి ఇండియన్ సినిమాలు అప్పుడప్పుడే రూ.100 కోట్ల మార్కును చూస్తున్నాయి. అవతార్ వచ్చే సమయానికి శివాజీ (2007), హిందీ గజిని (2008), మగధీర (2009) మాత్రమే రూ.100 కోట్లు దాటిన భారతీయ సినిమాలు. కానీ అవతార్ కూడా మనదేశంలో రూ.113 కోట్లు వసూలు చేసింది. ఒక హాలీవుడ్ సినిమా.. ప్రాంతీయ పెద్ద హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.
3. 25 సంవత్సరాల నుంచి దీని మీదనే
డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దాదాపు 1997 నుంచి అవతార్ మీదనే పనిచేస్తున్నారు. టైటానిక్ తర్వాత కామెరూన్ అవతార్ తప్ప మరో సినిమాను తీయలేదు. ఒక రెండు డాక్యుమెంటరీలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అంటే దాదాపుగా ముఫ్పై ఏళ్ల కాలంలో మూడే సినిమాలు. కానీ ఏ రోజూ కామెరూన్ అండ్ కో పని లేకుండా లేరు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎలా అయితే ఓ ప్రొడక్ట్ కోసం వర్క్ చేస్తుందో..అలా గత ముఫ్పై ఏళ్లుగా అవతార్ మీద పనిచేస్తోంది జేమ్స్ కామెరూన్ లైట్ స్టార్మ్ ఎంటర్ టైన్మెంట్. వందల సంఖ్యలో ఉద్యోగులు, జీతాలు, అబ్బో ఓ ఐటీ కంపెనీ కి ఉండే హంగులన్నీ జేమ్స్ కామెరూన్ ప్రొడక్షన్ హౌన్ కి ఉన్నాయ్.
4. సినిమా కోసం సూపర్ కంప్యూటర్లు
అవతార్ కు సంబంధించి అతి పెద్ద టాస్క్ గ్రాఫిక్స్. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌ను వెటా FX అనే సంస్థ హ్యాండిల్ చేస్తోంది. కేవలం అవతార్ కోసమే 10 వేల చదరపు అడుగుల స్థలంలో 4,000 సర్వర్లు, 35 వేల ప్రాసెసర్ కోర్లతో సర్వర్ ఫాంను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గ్రాఫిక్స్ ప్రాసెస్ చేయడానికి 104 టీబీ ర్యామ్ (దాదాపు 1,04,000 జీబీ) అవసరం అయ్యేది. దాని స్టోరేజ్ కోసం 3 పెటాబైట్ల డేటా (దాదాపు 30 లక్షల జీబీ) కావాల్సి వచ్చేది. కేవలం అవతార్‌కు సంబంధించిన గ్రాఫిక్స్, స్టోరేజ్ కోసమే మైక్రో సాఫ్ట్ ‘గయా’ అనే క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించింది. డిజిటల్ ప్రాసెసింగ్ సమన్వయం మొత్తం ఈ సంస్థ ద్వారానే జరిగేది. కేవలం పండోరా క్యారెక్టర్ల డిజైన్‌కే 10 లక్షల జీబీ వరకు స్టోరేజ్ అవసరం అయింది. ప్రపంచంలోని టాప్-500 సూపర్ కంప్యూటర్లలో అవతార్ రెండర్ ఫాంలోని కంప్యూటర్‌లు 193, 194, 195, 196, 197 స్థానాలను సంపాదించాయి. అంటే కేవలం ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు రూపొందించాల్సి వచ్చింది. వీటినే పార్ట్ 2 కు కూడా కంటిన్యూ చేశారు.
5. 1994లోనే స్టార్ట్
1994లోనే జేమ్స్ కామెరూన్ అవతార్‌ను రాయడం ప్రారంభించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. 1997లో టైటానిక్ పూర్తయ్యాక అవతార్‌ను తీసి.. 1999లో రిలీజ్ చేయాలనేది కామెరూన్ ప్లాన్. దానికి అప్పట్లోనే 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అయితే అప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తను అవతార్‌ను అనుకున్నట్లు తీయలేనని కామెరూన్‌కు అర్థమైంది. సో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మొదలు పెట్టిన అవతార్ సినిమా షూటింగ్ కేవలం 62 రోజులు మాత్రమే జరిగింది. ఇందులో 31 రోజులు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించగా.. మరో 31 రోజులు లైవ్ యాక్షన్ ఫొటోగ్రఫీ ద్వారా తీశారు. ఓ సారి పండోరా వరల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక అప్ గ్రేడ్ చేసుకుంటూ వెళుతూ వస్తున్నారు. అలా అవతార్ 2 కోసం ప్రత్యేకంగా ఓ వాటర్ వరల్డ్ క్రియేట్ చేశారు. మనం కళ్ల తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్స్ట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇవ్వటం పక్కా అంటున్నారు. అవతార్ 2 RealD 3D, Dolby Cinema, IMAX, IMAX 3D, Dolby Vision ఫార్మాట్స్ లో విడుదలవుతోంది. లండన్ లో డిసెంబర్ 6న ప్రీమియర్ అయ్యింది సినిమా. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ డేట్ మాత్రం డిసెంబర్ 16. లండన్ ప్రీమియర్ షో చూసిన వాళ్లంతా తమ జీవితంలో ఇదో అద్భుతమంటూ అవతార్ 2 ప్రశంసిస్తున్నారు.
6. బాక్సాఫీస్‌తో పాటు అవార్డులు కూడా
బాక్సాఫీస్ రికార్డులతో పాటు అవార్డులు కూడా రావడం ఏ సినిమాకు అయినా కష్టమే. కానీ కామెరూన్ మాత్రమే ఈ రెండిటినీ సాధించగలడు. అవతార్ సినిమా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ కాగా.. ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులను అందుకుంది. అంతకుముందు కామెరూన్ తీసిన క్లాసిక్ టైటానిక్ కూడా కలెక్షన్లతో పాటు ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఒక్క లండన్ ప్రీమియర్ షో తోనే అవతార్ ఐదు ఇంటర్నేషల్ అవార్డులను గెలుచుకుంది. మన RRR నామినేట్ అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు బెస్ట్ సినిమా, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో అవతార్ 2 నామినేట్ అయ్యింది.
7. పండోరా వెరీ స్పెషల్
అవతార్ అనగానే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింత వింత జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే జేమ్స్ కామెరూన్ చాలా సినిమాల్లో చూసిన లొకేషన్లు, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమేషన్ సినిమాల్లో చూసిన ప్రదేశాలు ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. వాటి ఆధారంగానే పండోరాను డిజైన్ చేశారు. అలాగే కొంతమంది భాషా నిపుణుల సాయంతో ఆ గ్రహంలోని వారు మాట్లాడే ‘నావి’ భాషకు సంబంధించిన లిపిని సృష్టించారు.
8. ప్రత్యేకమైన కెమెరాలు
అవతార్ 2 కోసం ప్రత్యేకంగా కెమెరాలు సిద్ధం చేసింది సోనీ కంపెనీ. జేమ్స్ కామెరూన్ సజెషన్స్ మేరకు లైట్ స్టోర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి....సోనీ వెనిస్ అనే కేమెరాను తయారు చేశారు. ఇది సోనీ నుంచి వస్తున్న ఫస్ట్ ఫుల్ ఫ్రేమ్ డిజిటల్ మోషన్ పిక్చర్ కేమెరా. మ్యాగ్జిమం వర్సెటేలిటీ ఉండేలా 3D స్టీరియో స్కోపిక్ రిగ్స్ ను ఇందులో వాడారు.
9. మూడు గంటల 12 నిమిషాల పాటు...
Avatar 2 runtime 192 minutes అంటే 3 hours 12 mins. ప్రపంచవ్యాప్తంగా 160+ భాషల్లో రిలీజ్. అంతే కాదు చైనాలోనూ అవతార్ 2 రిలీజ్ అవుతోంది. సాధారణంగా చైనా గవర్న్మెంట్ హాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేస్తూ ఉంటుంది. అలాంటిది అక్కడ కూడా అవతార్ 2 రిలీజ్ అవుతోంది. 160 కోట్ల జనాభా ఉన్న చైనా ఇండియా కంటే పెద్ద మార్కెట్ అవతార్ 2 దృష్టిలో.
10. మొదటి భాగంలోని పాత్రలే
ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో కనిపించిన శామ్ వర్తింగ్ టన్...జేక్ సల్లీ క్యారెక్టర్ లో, జో సల్డానా నేయిత్రి క్యారెక్టర్ లో మళ్లీ కనిపిస్తారు. పాతికేళ్ల తర్వాత టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ ..మళ్లీ జేమ్స్ కామెరూన్ సినిమాలో కనిపిస్తోంది. ఈ సారి రోనల్ అనే ఓ హ్యూమనాయిడ్ కేరక్టెర్ లో కేట్ విన్స్ లెట్ సందడి చేయనుంది. డీప్ వాటర్స్ లో తీసిన తన సీన్స్ కోసం 7-8 నిమిషాల పాటు బ్రీత్ తీసుకోకుండా అండర్ వాటర్ ఉండగలిగేలా కేట్ ప్రాక్టీస్ చేశారంట. ఆ సీన్స్ హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2024 డిసెంబర్ 20వ తేదీన అవతార్ 3 , 2026 డిసెంబర్ 18వ తేదీన అవతార్ 4, 2028 డిసెంబర్ 22వ తేదీన అవతార్ 5 విడుదల అవుతాయని జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. అవతార్ 2 ఈ టార్గెట్ రీచ్ అయిన దాన్ని బట్టే మిగిలిన సీక్వెల్స్ మీద కూడా ఓ డెసిషన్ కు వస్తామని కూడా కామెరూన్ ఇంటర్వ్యూల్లో చెప్పారు. సో ఇన్ని వింతలు విశేషాలున్న ఉన్న పండోరా గ్రహానికి తిరిగి స్వాగతం.