Karnataka Election 2023 : దక్షిణాదిన బీజేపీకి దారేది ? - ఇక ఎంట్రీ కష్టమేనా ?
దక్షిణాదిన ఇక బీజేపీకి పట్టు చిక్కడం కష్టమేనా ? బీజేపీ ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతోంది ?
Karnataka Election 2023 : కర్నాటక అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలయింది. నిజానికి గత ఎన్నికల్లోనూ బీజేపీ గెలవలేదు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రభుత్ం ఏర్పాటు చేసింది. దక్షిణాదిన బీజేపీ చేతుల్లో ఓ పార్టీ ఉందని చెప్పుకున్నారు. ఇక విస్తరిస్తామని ఆశపడ్డారు కానీ ఏక రాష్ట్రం చేజారిపోయింది. ఇక బలపడే చాన్సులు ఉండవేమో అన్న ఆందోళన బీజేపీ అగ్రనేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
అవినీతి ముద్రే బీజేపీకి అతి పెద్ద మైనస్ !
యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై హయాంలో చోటు చేసుకున్న అవినీతిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మత రాజకీయాలను అంగీకరించలేదు. అవినీతి అంశాన్ని పక్కన పట్టి.. కేంద్ర విజయాల్ని ఎక్కువగా ప్రచారం చేసేలా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి కేంద్ర మంత్రులంతా రంగంలోకి దిగారు. భజరంగ్ దళ్ వివాదాన్నీ ఎత్తుకున్నారు. అప్పర్ భద్ర సాగునీటి ప్రాజెక్టు కు కేంద్ర బడ్జెట్‌లో 5వేల కోట్లు పైగా కేటాయించి కర్నాటకకు మేలు చేశామని చెప్పుకోవడానికి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ప్రయత్నించారు. కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు ఇందిరాగాంధీ వంటి మహాశక్తి వంతురాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరగని మేలు మోడీ తమ రాష్ట్రానికి చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ ప్రచారంతో అవినీతి మరుగున పడలేదు. దీనికి ఫలితాలే సాక్ష్యం.
ప్రధాని దృష్టి పెట్టినా పరాజయమే..!
కర్ణాటకలో అధికారం కోల్పోతే ..దక్షిణాదిన పాతుకుపోవడం కష్టమన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. కర్ణాటక ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కర్నాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐదారుసార్లు పర్యటించారు. కర్నాటకపై బీజేపీ కేంద్ర నాయకులు దృష్టిని కేంద్రీకరించడానికి మరో ప్రధాన కారణం . ... హైదరాబాద్- కర్నాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఎఐసిసి అధ్యక్షునిగా ఎన్నిక కావడం. తమ ప్రాంతంలో కాంగ్రెస్‌ని గెలిపించుకోవ డానికి సర్వశక్తులు ఒడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న రాష్ట్రంలో గెలిస్తే .. ఆ పార్టీని నైతికంగా మరింత దెబ్బకొట్టవచ్చన్న ఆలోచించారు. కానీ పూర్తిగా దెబ్బతిన్నారు.
దక్షిణాదిలో విస్తరణకు చెక్ పడినట్లే..!
బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి కారణం ఉత్తరాది లో వచ్చే సీట్లే. ఆ పార్టీకి ఉన్న 303 సీట్లలో 90 శాతానికిపైగా ఉత్తరాది నుంచి వచ్చేవే. ప్రతీ సారి ఉత్తరాదిలో అన్ని సీట్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. మళ్లీ గెలవాలంటే దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే ముందు పార్టీ బలపడాలి. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా... దక్షిణాదిలో పార్టీని విస్తరించడం దుర్లభమవుతంది. అందుకే ఇప్పుడు బీజేపీ కంగారు పడుతోంది. దక్షిణాదికి ఏ దారిలో ఎంట్రీ ఇవ్వాలా అని ప్రయత్నాలు చేస్తోంది.