Tadipatri News : తాడిపత్రిలో పై చేయి సాధించేదెవరు ? జరుగుతున్న గొడవులు ఆగిపోతాయా? కొనసాగుతాయా?
Anantapur News: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హెడ్‌లైన్స్‌లో ఉన్న నియోజకవర్గం తాడిపత్రి. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు ఇప్పుడు రిజల్ట్ తర్వాత ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది.
Andhra Pradesh News: ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రాజకీయం రణరంగంగా ఉంటుంది. నాలుగు దశాబ్దాల కాలంగా రాజకీయంగా తిరుగులేని కుటుంబం ఒకవైపు... అలాంటి కుటుంబాన్ని ఢీకొడుతున్న కుటుంబం మరోవైపు. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టు రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నేతల గొడవ తారస్థాయికి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు ముగిశాయి. అయినా ఇంకా ప్రజల నోట నానుతున్న పేరు తాడిపత్రి. ఇక్కడ గెలిచేది ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం రాజకీయ కక్షలతో తాడిపత్రి నియోజకవర్గం చాలా హాట్‌హాట్‌గా ఉంది. ఎప్పుడు ఏ ప్రత్యర్థి విరుచుకుపడతాడో అన్న భయం ప్రజల్లో ఉంది. అందుకే ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందం అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుంది.
ఇంత హాట్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో విజయం ఎవర్ని వరిస్తుందనే చర్చ జిల్లాలోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు వరకు తాడిపత్రి నియోజకవర్గంలో జెసి కుటుంబానికి తిరుగు లేదు. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రసంతరంగా మారింది.
ప్రస్తుతం జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఈ రెండు కుటుంబాలే ఎన్నికల బరిలో నిలిచాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి బరిలో నిలిచారు. వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిదో అన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు కుటుంబాలకు ఫ్యాక్షన్ గొడవలు...
దశాబ్దాల కాలంగా జెసి కుటుంబానికి కేతిరెడ్డి కుటుంబానికి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న జెసి ఫ్యామిలీది ఎప్పుడు పై చేయిగా ఉండేది. జెసి దివాకర్ రెడ్డి వరుసగా ఆరుసార్లు 1985,1989, 1994,1999,2004,2009 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో అనంతపురం ఎంపీగా కూడా గెలుపొందారు. తాడపత్రి ఎమ్మెల్యేగా ఒకసారి 2014లో జెసి ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా 2019 ఎన్నికల్లో జెసి వారసులు రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ మధ్య తాడిపత్రి నియోజకవర్గం నుంచి జెసి అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జెసి పవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. ప్రస్తుత ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గ నుంచి జెసి అస్మిత్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఎవరు గెలిచిన స్వల్ప మెజారిటీనే ?
ప్రస్తుతం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాడపత్రి నియోజకవర్గంలో తొలిసారిగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా పాదయాత్రలు కూడా చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి అభ్యర్థి జెసి ఆస్పత్ రెడ్డి కూడా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. మండలాల వారీగా నేతలతో సమావేశాలు బస్సు యాత్రలు ఇలా వివిధ కార్యక్రమాలతో ఎన్నికలే టార్గెట్‌గా జెసి ప్రభాకర్ రెడ్డి నడిచారు. కూటమి మేనిఫెస్టో గతంలో తాడపత్రి నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి గెలిపించబోతుందని జెసి అస్మిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడంతో తాడిపత్రి నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు నిలిచారు అన్నది ఆసక్తిగా మారింది. దీంతో నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీని వస్తుందని చర్చ కొనసాగుతోంది.
ఎవరు గెలిచినా గొడవలు తప్పవా ?
పోలింగ్ రోజు ఆ తరువాత రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున రాళ్లురువుకోవడం హింసత్మక ఘటాలు పాల్పడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ గొడవల్లో ఇప్పటికే చాలామందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గొడవల కారణంగా మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులు సైతం తాడిపత్రి పట్టణాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. కౌంటింగ్ అనంతరం కూడా తాడపత్రి లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటయాన్న కారణంతో తాడపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.