Amit Shah: అమిత్ షాపై కేసు నమోదు - చిన్నారులతో ప్రచారం చేయించారనే ఫిర్యాదుతో ఈసీ కీలక ఆదేశాలు
Telangana News: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై హైదరాబాద్ మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదుతో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.
Case Filed On Amit Shah: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పొలిటికల్ హీట్ నెలకొంటోంది. ఓవైపు రాజకీయ పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలు.. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాన నేతలపై ఈసీకి ఫిర్యాదులతో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ పై సైతం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. తాజాగా, నిబంధనలు ఉల్లంఘించారని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పైనే ఈసీ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భంలో ఆయన చిన్న పిల్లలతో ప్రచారం చేయించారనే పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది
ఈ నెల 1వ తేదీన (బుధవారం) బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత (Madhavi Latha) పాతబస్తీలో (Old City) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ లో ఆమె తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. అయితే, మాధవీలత మాట్లాడే సమయంలో కొంతమంది చిన్నారులను అమిత్ షా తన వద్దకు రమ్మంటూ సైగ చేశారు. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఓ చిన్నారి చేతిలోని బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో 'ఆప్ కీ బార్ 400 సీట్స్' అంటూ రాసి ఉందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల అధికారికి తన ఫిర్యాదులో వివరించారు. ఎన్నికల నిబంధనలను బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. దీంతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విచారణ చేసిన మొఘల్ పురా పోలీసులు విచారించి క్రైం నెంబర్ 77/2024 సెక్షన్ 188 ఐపీసీ కింద అమిత్ షాపై కేసు నమోదు చేశారు. ఏ1గా యమాన్ సింగ్, ఏ2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, ఏ3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏ4గా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఏ5గా MLA రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజాసింగ్ ఆగ్రహం
అయితే, పోలీసులు తమపై కేసు నమోదు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మద్యం పంపిణీ చేస్తోన్న కాంగ్రెస్ నేతలపై ఇప్పటివరకూ ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు తమపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Jeevan Reddy: మహిళా కూలీకి కాంగ్రెస్ అభ్యర్థి చెంపదెబ్బ - వీడియో వైరల్, బీఆర్ఎస్ విమర్శలు