(Source: ECI/ABP News/ABP Majha)
Elections 2024 : నాలుగు జిల్లాల పరిధిలో లోక్‌సభ నియోజకవర్గాలు - తెలంగాణలో ప్రత్యేకం !
Telangana Elections : తెలంగాణలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు నాలుగు జిల్లాల పరిధిలో ఉన్నాయి. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల ఇలా జరిగింది.
Two Lok Sabha constituencies in four districts : పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటే. కానీ ఆ నియోజకవర్గ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇలా ఒకటి కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ రెండుపార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాలు ఒకటి ఎస్సీ నియోజకవర్గం కాగా మరొకటి ఎస్టీ నియోజకవర్గం. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి.
ఎస్టీ రిజర్వుడ్ అయిన మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోకి మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, భద్రాచలం పినపాక, ఇల్లంద, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తాయి. అయితే ఈ నియోజకవర్గాలన్నీ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం విశేషం. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, డోర్నకల్ ఉండగా వరంగల్ జిల్లా పరిధిలో నర్సంపేట, ములుగు జిల్లా పరిధిలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో భద్రాచలం, పినపాక, ఇల్లంద అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో నర్సంపేట మినహా మిగితా ఆరు నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు.
ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి కూడా వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇందులో వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ ఎస్సి నియోజక వర్గాలు కాగా మిగితా ఐదు నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో గెలిచిన ఎంపి లు నాలుగు జిల్లాల్లో ప్రోటోకాల్ తీసుకోవడంతోపాటు నాలుగు జిల్లాల అధికారులతో కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంటుంది.
ఒక్క జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు చిన్న జిల్లాల ఏర్పాటుతో నాలుగు, నాలుగు జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. 2014లో పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పడే నాటికి సగటున 35 లక్షలకుపైగా జనాభా జిల్లాల్లో ఉండేది. 2016 అక్టోబరులో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వనపర్తి, ములుగు, జోగులాంబ గద్వాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా విభజన తర్వాత ఏడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. ఎంపీ ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ఐదు జిల్లాల అధికారులతో మాట్లాడాల్సి వస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్‌లో సభ్యుల సంఖ్య కేవలం ఐదు. వారిలో ఒకరు చైర్మన్ కాగా, మరొకరు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ ఐదుగురితోనే జిల్లా పరిషత్ నడుస్తోంది. తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత ఇలాంటి విచిత్రాలు చాలా చోటు చేసుకున్నాయి.