Kavitha Challenges To Rahul : రాజకీయాల నుంచి తప్పుకుంటా- కవిత సంచలన ప్రకటన
Telangana Elections 2023 : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగమైనా ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కవిత.
Telangana Elections 2023 : తెలంగాణలో నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో పాటే సవాళ్ల పర్వాలు కూడా పీక్స్‌కు చేరాయి. నిరుద్యోగులతో ముచ్చట్లు చెబుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సవాల్ స్వీకరించాలన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగాల నియామకంలో తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగమైనా ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు కవిత. లేకుంటే రాహుల్ గాంధీ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అందుకు సిద్ధమా...? అని ఛాలెంజ్ చేశారు.
I challenge Rahul Gandhi to show if any existing Congress ruled State has created even a single Government job more than Telangana.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 28, 2023
BJP ruled Haryana is no 1 in unemployment, followed by Congress ruled Rajasthan which is no 2!
Both Congress & BJP could only give 21 govt jobs… pic.twitter.com/xsGRJsLytD
బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇంత స్థాయికి పడిపోయిందన్నారు. జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టి విక్రమార్క వంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ అని సెటైర్లు వేశారు.
కర్నాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందన్నారు కవిత. 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారని గుర్తుచేశారు. కానీ అందులో వేటిని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. కర్నాటకలో మహిళలకు రూ. 2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఇంకా మొదలుపెట్టలేదని పేర్కొన్నారు. యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని తెలిపారు. బియ్యం పథకానికి బియ్యం లేదని చెప్పి అది కూడా పంపిణీ చేయడం లేదని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని ఆరోపించారు.
కర్నాటక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు సీనియర్ నాయకులు మొత్తం ఇదే రకమైన డ్రామాలు చేశారన్నారు కవిత. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరుద్యోగంలో బీజేపీ పాలనలో ఉన్న హర్యానా నెంబర్ వన్‌గా ఉందని, కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ రెండో స్థానంలో ఉందన్నారు.