Telangana Elections 2023 : కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం - హైదరాబాద్‌లో మోదీ తోలుబొమ్మలాటల ప్రదర్శన వైరల్ !
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త తరహా ప్రచారం చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకటే అని చెప్పేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది.
Telangana Elections 2023 : హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. నేతలంతా ప్రజల్లోకి వెళ్తే.. సోషల్ మీడియా సైన్యాలు.. డిజిటల్ ప్రపంచంలో పొలిటికల్ వార్ ( Political War ) చేస్తున్నాయి. మరికొంత మంది వ్యహాత్మకంగా ఇతర పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కొంత మంది హైదరాబాద్‌లో మోదీ తోలు బోమ్మలాటలు ( Modi Puppet Show ) అంటూ కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది.
బీఆర్ఎస్, మజ్లిస్‌లను మోదీ ఆడిస్తున్నారని కాంగ్రెస్ ప్రచారం
బీఆర్ఎస్, ఎంఐఎంలను ( MIM ) తోలుబొమ్మల్లా ఆడిస్తున్న ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని ఈ ప్రదర్శన ద్వారా వారు చెప్పదల్చుకు్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్, ఎంఐఎంలను బీజేపీ చేతిలో కీలుబోమ్మలని తెలియజేసేలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను ప్రతిబింబించేలా తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలుబోమ్మల్లా ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది.హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది.
మజ్లిస్, బీఆర్ఎస్ పరోక్ష సహకారంతో రాజకీయాలు
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకోలేదు కానీ.. పరస్పరం సహకరించుకుంటున్నాయి. మజ్లిస్ కేవలం తొమ్మిది స్థానాల్లోనే పోటీ చేస్తోంది. మిగతా అన్ని చోట్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం మజ్లిస్ నేతలు కూడా పలు చోట్ల ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలను ప్రధాని మోదీ ఆడిస్తున్నారని కాంగ్రెస్ తరచూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా ఇతర రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లను చీల్చేందుకు అభ్యర్థుల్ని నిలబెడుతోందని ..బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తోందని ఆరోపిస్తోంది.
పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు నష్టం కలిగేలా మజ్లిస్ అభ్యర్థుల్ని నిలబెడుతోందని ఆరోపణలు
ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లోనూ వారు ముగ్గురూ ఒకరేనని చెప్పడానికి.. ఈ తోలుబొమ్మలాట కాన్సెప్ట్ ను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్టుగా సునీల్ కనుగోలు వ్యవహరిస్తున్నారు. ఆయన టీంఇలాంటి కొత్త తరహా ప్రచారాలు చేయడానికి విస్తృతంగా శ్రమిస్తోంది. కర్ణాటకలోనూ ఇలాగే ప్రచారం చేశారు. అక్కడ క్లిక్ అయింది. పార్టీ విజయం సాధించడంతో ఆదే మోడల్ ను తెలంగాణలోనూ అమలు చేస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ కూడా వినూత్న రీతిలో నే ప్రచారం చేస్తోంది.