Telangana Election Results: తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ ఆలస్యమయ్యే ఛాన్స్ - ఎందుకో కారణం చెప్పిన వికాస్ రాజ్
Telangana Election Results 2023: అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతామని వివరించారు.
Telangana Assembly Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతామని వివరించారు. ప్రతీ ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఈవీఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. లోపలా బయటా సీసీటీవీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టింది. ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో, హైదరాబాద్ లో 13 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 14 ప్లస్ 1 చొప్పున టేబుల్స్, పోలింగ్ కేంద్రాలు ఎక్కువున్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేస్తామని ఈసీ అధికారులు చెప్పారు. ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, పటాన్ చెరు నియోజకవర్గాలకు 20 ప్లస్ 1 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక, 500 లకు పైగా కేంద్రాల్లో పోలింగ్ జరిగిన శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 28 ప్లస్ 1 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో టేబుల్ కు ఆరుగురు అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో సహా ఒక్కో టేబుల్ కు మొత్తం ఆరుగురు ఉంటారు.