Telangana Election 2023: ఓటింగ్ పెంచేందుకు ఈసీ కొత్త విధానం- ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్ కేంద్రాలు
Telangana Election Commission: హైదరాబాద్‌లో ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్ కేంద్రాలు కనిపించనున్నాయి. యువత, మహిళ, దివ్యాంగుల ఓటింగ్ పెంచడం కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Defferent Polling Stations In Telangana: తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల సమయం ఉంది. నవంబర్ 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తున్నారు. సరికొత్త విధానాలను అవలంభిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక థీమ్‌లతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాయి.
ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోరు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, దివ్యాంగులు ఉంటారు. యువత కూడా చాలా మంది ఓటు వేయడంలేదని అధికారులు గుర్తించారు. దీనికి ఎన్నో రకాల కారణాలు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లి.. గంటల తరబడి క్యూలో ఏం ఉంటామని అనుకోవచ్చు. మహిళలు అయితే... ఎక్కడ ఎవరు ఉంటారో ఏమో... ఏం వెళ్తాములే అన్న ఆలోచన కావొచ్చు. దివ్యాంగులు పొలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేక... ఓటింగ్‌కు దూరంగా ఉండొచ్చు. ఇలా కారణం ఏదైనా... ఆయా వార్గాల నుంచి ఎక్కువ మంది ఓట్లు వేయకపోవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని ప్రయత్నిస్తున్నారు ఎన్నికల అధికారులు. అందరినీ పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది ఎన్నికల సంఘం. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. యువత, మహిళలు, దివ్యాంగుల ఓటింగ్ శాతం పెంపొందించాలన్న లక్ష్యంతో వీరికి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక థీమ్‌లతో ఈ పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మహిళల నిర్వహణలో 75 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయన్నారు. అలాగే 15 పీడబ్ల్యూడీ, మరో 15 యూత్ మేనేజ్‌మెంట్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలా 75 మోడల్ పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ థీమ్‌తో ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇక... ఇప్పటికే పోలింగ్ శాతం పెంచేందుకు పలు విధానాలను అవలంభిస్తున్నారు అధికారులు. అందుకు టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు. భారీ క్యూలైన్లకు భయపడి ఓటు వేయడం మానుకునే వారి కోసం... కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోని క్యూలైన్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను... ఓటర్ మొబైల్ ఫోన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. దీని వల్ల... పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు తక్కువగా ఉన్న సమయంలో వచ్చి... ఓటువేసి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా... ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.