Telangana Elections 2023: మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం, ఓటర్లు నిలదీయడంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు!
Errabelli Dayakar Rao left polling station: పోలింగ్ రోజున సైతం బీఆర్ఎస్ కీలక నేతలకు నిరసన సెగ తగిలింది. మంత్రి దయాకర్ రావుకు ఓ పోలింగ్ బూత్ లో చేదు అనుభవం ఎదురైంది.
Telangana Assembly Election 2023: వరంగల్: మొన్నటివరకూ ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు, మంత్రులకు పలుచోట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. తాజాగా పోలింగ్ రోజున సైతం బీఆర్ఎస్ కీలక నేతలకు నిరసన సెగ తగిలింది. మంత్రి దయాకర్ రావుకు ఓ పోలింగ్ బూత్ లో చేదు అనుభవం ఎదురైంది. ఓటర్లు ప్రశ్నించడంతో ఏం చేయాలో పాలుపోక నిమిషాల వ్యవధిలో పోలింగ్ కేంద్రాన్ని వీడారు మంత్రి ఎర్రబెల్లి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దయాకర్ రావును నిలదీసిన ఓటర్లు..
పాలకుర్తి నియోజకవర్గం హరిపురాల గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. హరిపురాల గ్రామంలో ఓ పోలింగ్ బూత్ కు వెళ్లిన దయాకర్ రావును అక్కడ ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు అడ్డుకున్నారు. ఇన్ని రోజులు మీకు మేం కనిపించలేదా అని ప్రశ్నించారు. వారి మాటల్ని పట్టించుకోకుండా దయాకర్ రావు పోలింగ్ స్టేషన్లో తిరిగే ప్రయత్నం చేసినా ఓటర్లు గట్టిగా నిలదీయడం, ప్రశ్నిస్తుండటంతో పోలింగ్ ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడి నుండి వెళ్లిపోయారు. అధికారం ఇస్తే దొరికినంత దోచుకున్నారంటూ కొందరు ఓటర్లు మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన అక్కడి నుంచి మరో పోలింగ్ కేంద్రానికి తన వాహనంలో వెళ్లిపోయారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్ లో బూత్ నెం 265లో ఓటు వేశారు. ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనదని, అందరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంటల వరకు 36.68 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ 50.80 శాతం ఓటింగ్ నమోదు కాగా, మరోసారి అత్యల్పంగా హైదరాబాద్ లో 20.79 శాతం పోలింగ్ జరిగింది.
మధ్యాహ్నం 1 గంటల వరకు జిల్లాల వారీగా ఓటింగ్ శాతం..
ఆదిలాబాద్ 41.88శాతం
భద్రాద్రి 39.29 శాతం
హనుమకొండ 35.29 శాతం
హైదరాబాద్ 20.79 శాతం
జగిత్యాల 46.14 శాతం
జనగాం 44.31 శాతం
భూపాలపల్లి49.12 శాతం
గద్వాల్ 49.29 శాతం
కామరెడ్డి 40.78 శాతం
కరీంనగర్ 40.73 శాతం
ఖమ్మం 42.93 శాతం
ఆసిఫాబాద్ 42.77 శాతం
మహబూబాబాద్ 46.89 శాతం
మహబూబ్ నగర్ 44.93 శాతం
మంచిర్యాల 42.74 శాతం
మెదక్ 50.80 శాతం
మేడ్చల్ 26.70 శాతం
ములుగు 45.69 శాతం
నాగర్ కర్నూల్ 39.58 శాతం
నల్గొండ 39.20 శాతం
నారాయణపేట 42.60 శాతం
నిర్మల్ 41.74 శాతం
నిజామాబాద్ 39.66 శాతం
పెద్దపల్లి 44.49 శాతం
సిరిసిల్ల 39.07శాతం
రంగారెడ్డి 29.79శాతం
సంగారెడ్డి 42.17 శాతం
సిద్దిపేట 44.35 శాతం
సూర్యాపేట 44.14 శాతం
వికారాబాద్ 44.85 శాతం
వనపర్తి 40.40 శాతం
వరంగల్ 37.25 శాతం
యాదాద్రి భువనగిరిలో 45.07 శాతం పోలింగ్ నమోదైంది
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply