![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Teenmar Mallanna News: కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న-హస్తం పార్టీలో జాయినింగ్ జోష్
Teenmar Mallanna News: కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
![Teenmar Mallanna News: కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న-హస్తం పార్టీలో జాయినింగ్ జోష్ Telangana Election 2023 Chintapandu Naveen Alias Teenmar Mallanna Joined Congress Party Teenmar Mallanna News: కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న-హస్తం పార్టీలో జాయినింగ్ జోష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/cca0119a9b9d6ab1076830431ce5030f1699421108426841_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Teenmar Mallanna News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) వేళ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ జోష్ పెరుగుతోంది. నేతల చేరికలతో దూకుడు పెంచుతోంది హస్తం పార్టీ. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని.. కలిసి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. బీఆర్‌ఎస్(BRS) పార్టీని ఓడించి... అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు పార్టీల నేతల కాంగ్రెస్(Congress) కండువా కప్పుకోగా... తాజాగా తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ హస్తం పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే, తెలంగాణ ప్రదేశ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తీన్మార్ మల్లన్న.
మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. మేడ్చల్‌లో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను కూడా కోరారు. కానీ కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు తీన్మార్ మల్లన్న. రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు... బీసిలకు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని కూడా విమర్శలు గుప్పించారు. అన్ని ఆరోపణలు చేసి... ఇప్పుడు అనూహ్యంగా అదే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తీన్మార్ మల్లన్న.
గతంలో బీజేపీలో ఉన్న మల్లన్న.. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అధికార పార్టీతో పాటు బీజేపీపై కూడా విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గతంలో జరిగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ తరఫున మల్లన్న పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి తీన్మార్ మల్లన్నే అని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. ఇంతలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. మల్లన్నను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న మల్లన్నకు.. ఆ పార్టీ ఏం హామీ ఇచ్చింది అన్నది బయటకు రాలేదు. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవరన్న ఉన్న తీన్మార్ మల్లన్న.. తమ పార్టీలో చేరడం ప్లస్ అవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)