Telangana BJP Campaign : తెలంగాణపై అగ్రనేతల దృష్టి ఎప్పుడు ? హంగామా లేకుండా సాగుతున్న బీజేపీ ప్రచారం !
Telangana News : తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల ప్రచారం లేకుండా స్తబ్దుగా సాగుతోంది. అమిత్ షా, మోదీల పర్యటనలపై ఇంకా స్పష్టత రాలేదు.
Telangana BJP is going stagnant without the campaign of key leaders : తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారం అంత ఉత్సాహంగా సాగడం లేదు. బీజేపీ తెలంగాణ ముఖ్యనేతలు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. వేరే నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం లేదు. జాతీయ స్థాయి నేతల షెడ్యూల్‌పై స్పష్త కనిపించడం లేదు. బహిరంగ సభలు, ముఖ్యనేతలు ఇప్పటివరకైతే ఎవరూ కనిపించలేదు. ఎన్నిలకు ఇంకా మూడు వారాల కన్నా తక్కువ సమయంమే ఉండటంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
వారానికి మూడు లేదా నాలుగు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈనెల 25న కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
సిద్ధిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. మెదక్ నుంచి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. ఈ సభ తర్వాత చెవెళ్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లో భారీగా సభలకు ప్లాన్ చేస్తోంది. అయితే వేరే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉండడంతో తేదీల ప్రకటన కాస్త ఆలస్యమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో మిగతా సభలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ప్రధాని మోదీ ఎన్ని బహిరంగసభల్లో ప్రసంగిస్తారన్నదానిపై ఇంకా స్పష్తత రాలేదు. ఆయన ఏపీలో నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మోదీ తో మూడు నాలుగు సభలు ఏర్పాటు చేస్తే.. బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కొంత మంది కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినా వారెవరో..సామాన్యులకు తెలిసే అవకాశం లేకపోవడంతో ప్రయోజనం ఉండటం లేదు. తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను నమ్మే పరిస్థితి లేదని.. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయలేకపోయిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దండగ అని బీజేపీ ప్రచారం చేస్తోంది.
అయితే బీజేపీ అనుబంధ సంఘాలతో క్షేత్ర స్థాయి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్‌లకు 32 వేల బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇంచార్జ్ సహా 21 మందితో బూత్ కమిటీలను నియమించారు. ప్రతీ మూడు పోలింగ్ బూత్‌లను కలిపి శక్తి కేంద్రంగా ఏర్పాటు చేశారు. బూత్ లెవెల్‌లో ప్రతీ ఓటర్‌ను కలిసేలా కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ మూడు కుటుంబాలకు ఒక ఇంచార్జ్‌ను నియమించడంతో పాటు 30 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్‌కు బాధ్యత అప్పగించారు. ఒక్కో పన్నా ప్రముఖ్ కనీసం 30 మంది ఓటర్లను కలిసి ఓటు వేయించేలా బాధ్యతలు అప్పగించారు. ప్రతీ ఇంటికి మోదీ చేసిన సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని.. మోదీ మేనియా నేపథ్యంలో మోదీ నామస్మరణతో ప్రతీ గడప బీజేపీకి మద్దతు తెలిపేలా ప్రచారం చేస్తున్నారు.