Telangana Elections 2023 Live News Updates: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- విచారణకు ఆదేశం
Telangana Election Live News: తెలంగాణ ఎన్నికల ప్రచార వార్తల లైవ్ అప్ డేట్స్ మీకోసం..
LIVE
Background
గెలిస్తే జైత్రయాత్ర ఓడితే శవయాత్ర... ఏ యాత్రకి వస్తారో ఓటర్లే తేల్చోవాలని హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చేసిన కామెంట్స్‌పై ఈసీ స్పందించింది. ఆ వ్యాఖ్యలపై పూర్తిగా విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీనిపై స్థానిక అధికారులు ఎలాంటి సమాచారం అందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఫ్యామిలీతో ప్రచారం చేసిన కౌశిక్ రెడ్డి భావోద్వేగమైన ప్రసంగం చేశారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూనే... తాను ఓడిపోతే ఆత్మహత్యే గతి అన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారో ఓడించి శవయాత్ర చేస్తారో ప్రజలే చెప్పాలని పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. పోలింగ్ సామాగ్రిని నేడు పంపిణీ చేయనున్నారు అధికారులు. దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడికే సిబ్బంది చేరుకొని తమకు కేటాయించిన సామగ్రిని కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే వారి కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దే ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఫెసిలిటీ సెంటర్‌లో కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. అక్కడే ఎన్నికల సామగ్రి కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఏర్పాటు చేసిన వెహికల్స్‌లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని చేరవేసేందుకు ఉంచిన వాహనాలకు ముందే రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ ప్రకారమే వెహికల్స్ మూమెంట్ ఉంటుంది. వేరే దారిలో వెళ్లే పరిస్థితి ఉండకూదు. మార్గ మధ్యలో ఆప కూడదని కూడా ఆదేశాలు ఉన్నాయి. వాటికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందని ఏ జరుగుతుందో స్పష్టంగా తెలిసిపోతుందని ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులు అక్కడకు చేరుకుంటారని పేర్కొన్నారు.
ఉదయం ఐదున్నరకు మాక్ పోలింగ్
గురువారం ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆటైంకు అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను టచ్ చేయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందరి సమక్షంలో మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఉదయం ఏడు గంటలకు సాధారణ పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిస్తారు మిగతా ప్రాంతాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఐదు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసుకునే హక్కు ఉంటుంది.
పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఈసారి విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారు విజయవంతంగా ఓటు వేసి వెళ్లేందుకు వీలుగా 21 ,686 వీల్‌ఛైర్లు ఏర్పాటు చేసింది. 80 ఏళ్లుపైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తోంది. ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు పంపిణీ చేసింది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపి ఉన్న ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 120పైగా కేంద్రాలను దివ్యాంగులే నిర్వహించనున్నారు. మరో ఆరువందల కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 375 కంపెనీల సాయుధ బలగాలు, 50వేల మంది స్థానిక పోలీసులను ఎన్నికల సంఘ వినియోగిస్తోంది.
ఓటరు స్లిప్‌లను మాత్రం గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోమని... ఓటరు ఐడీ కానీ వేరే ఇతర 12 రకాల ఐడీలు కానీ ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు స్లిప్పులపై ఎలాంటి గుర్తులు ఉండటానికి వీల్లేదని చెప్పింది. అలాంటి వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని లేకుంటే తిరస్కరిస్తామని పేర్కొంది. ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లు ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు సెల్ఫీలు, ఇతర ఫొటోలు తీయడానికి కూడా వీల్లేదని చెబుతున్నారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లు కచ్చితంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరిస్తున్నారు.
సిద్దిపేటలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్న మంత్రి హరీష్ రావు
సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో ఉదయం 7-8 గంటల మధ్యలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్న మంత్రి హరీష్ రావు దంపతులు.
ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావొద్దు - సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్లా రెడ్డి
సికింద్రాబాద్: గంటల వ్యవధిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు బందోబస్తు కోసం భారీ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్లా రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో 2 లక్షల 62 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 102 కేంద్రాల్లో 220 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావద్దని స్వఛ్చందంగ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
SR నగర్‌లో ఓటు వేయనున్న సీఈవో వికాస్ రాజ్
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ రేపు ఉదయం 7.30 గంటలకు పోలింగ్ స్టేషన్ నంబర్ 188-SR నగర్, నారాయణ జూనియర్ కళాశాల, SR నగర్‌లో కుటుంబ సమేతంగా ఓటు వేయనున్నారు.
ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలి: హైకోర్టు
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వలేదని, దీంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ ఈ రోజు ముగిసింది. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనుక వారందరికీ ఆ మేరకు సౌకర్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు లక్షా డెబ్బై ఐదు వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ లో ముగ్గురు పోలీసులను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ ఏ యాదగిరి, ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ లపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి (Musheerabad BRS Candidate) సంబంధిత వ్యక్తులు డబ్బులు పంచుతుంటే చర్యలు తీసుకోలేదని అభియోగాలున్నాయి.
ఓ అపార్ట్ మెంట్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు ముఠా జయసింహా పట్టుబడ్డారు. అయితే ఈ కేసులో ముఠా జయ సింహాను పోలీసులు తప్పించి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకు సిఐ, ఏసీపీ , డీసీపీ లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.