(Source: Poll of Polls)
తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు ఖాయమేనా ! పవన్ పార్టీకి 33 సీట్లు ఇస్తారా ?
వచ్చే ఎన్నికల్లో గెలుపొంది, తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ తనకున్న అన్ని వనరులను వినియోగించుకునేందుకు రెడీ అయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇప్పటి దాకా తెలంగాణలో పోటీ చేయని జనసేన పార్టీతో బీజేపీ జట్టు కట్టేందుకు రెడీ అవుతోంది. 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి కమలం నేతలు, 67 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది, తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ తనకున్న అన్ని వనరులను వినియోగించుకునేందుకు రెడీ అయింది. అందులో భాగంగా రాష్ట్రంలో జనసేనతో జట్టు కట్టాలని రెడీ అయింది. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. ఆయన ఇంటికి వెళ్లిన నేతలు కలిసి పని చేద్దామంటూ ప్రతిపాదన చేశారు. దీనికి పవన్ కల్యాణ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.
33 సీట్లు డిమాండ్ చేస్తున్న పవన్
తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన సీట్లు కాకుండా పెండింగ్ లో ఉన్న సీట్లకు అభ్యర్థుల ఎంపిక, జనసేనకు కేటాయించే అసెంబ్లీ స్థానాలపై జనసేనానితో అమిత్ షా, కిషన్ రెడ్డి చర్చించారు. సుదీర్ఘ చర్చల తర్వాత పొత్తులపై బీజేపీ, జనసేన పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కేటాయించే సీట్లు కూడా అమిత్ షా ఫిక్స్ చేసినట్లు సమాచారం. జనసేనాని పవన్ కల్యాణ్ ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని అమిత్ షా, పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు సమాచారం. నవంబరు 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.
టీడీపీ దూరమవడంతో జనసేన
తెలుగు రాష్ట్రాల్లోని యువతలో పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలు హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా గుడ్ సంపాదించుకున్నారు. మెజార్టీ పవన్ కల్యాణ్ ను అభిమానిస్తారు. జనసేన కార్యకర్తలతో పాటు యువత ఓట్లను కొల్లగొట్టేందుకు పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల దాకా తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చాయి. 2018 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ ఘోరంగా ఓడిపోయింది. ఏపీలో 23 అసెంబ్లీ సీట్లు వస్తే, తెలంగాణలో రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయింది. దీంతో బీజేపీ నేతలు జనసేనాని పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. ఆయన ఒకే చెప్పడంతో కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతోంది బీజేపీ. జనసేన కోరుకున్నట్లు 33 సీట్లను వారు అడిగిన జిల్లాల్లోనే బీజేపీ సీట్లు కేటాయిస్తుందా ? లేదంటే తగ్గించి సీట్లు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కోక్కరుగా నేతలు పార్టీని వీడుతున్న వేళ, జనసేనతో పొత్తు బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.