విభేదాలు వీడి కలిసికట్టుగా ముందుకెళ్తేనే విజయం, తెలంగాణ కాంగ్రెస్‌లో అది సాధ్యమేనా?
కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీకి కొత్త ఊపొచ్చింది. దశాబ్దం కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీకి కొత్త ఊపొచ్చింది. దశాబ్దం కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గులాబీ పార్టీకి ఓటమి రూచి చూపించాలని కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యమత్యంగా సాగుతున్నారు. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి నేతల్ని ఆహ్వానించడంతో పాటు పార్టీ వీడిన సీనియర్లకు మళ్లీ టచ్ లోకి వెళ్లింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణరావు, మైనంపల్లి హనుమంతరావు వంటి నేతలు చేరికతో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా బలం పెరిగింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహప్రతివ్యూహాలు, ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్న పార్టీ నేతలు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి రావడానికి అధిష్టానం అనేక వ్యూహాలను పన్నుతోంది. ఇప్పటికే పార్టీ నిర్వహించిన సర్వేల ఆధారంగా బలంగా ఉన్నటువంటి నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. నియోజకవర్గం ఏదైనా సరే సొంత పార్టీ నాయకుల కంటే బలమైన నాయకుడు ఎక్కడున్నా పార్టీలోకి తీసుకుంటోంది. టికెట్ రేస్ లో ఉన్న వాళ్లు ఎవరైనా సర్వే ఆధారంగానే బీఫామ్ ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలోకి ఎవరు వస్తానన్న వద్దనేది లేదన్నది కాంగ్రెస్ ప్లాన్. కర్ణాటకలో ఫైవ్ పాయింట్ ఫార్ములాను జనంలోకి తీసుకువెళ్లింది. అక్కడ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇది కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లారు. ఎక్కడ చూసినా ఈ పథకాల గురించే చర్చ జరుగుతోంది.
పార్టీకి బలమైన కేడర్
కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ ఎక్కువ. ఎప్పుడు ఎవరు ఎవర్ని విమర్శిస్తారో అంచనా వేయలేం. అలాంటి పార్టీలో కొంతకాలంగా బహిరంగ విమర్శలు లేనే లేవు. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న నేతలు కూడా కలిసిపోయారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తామని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు బహిరంగ విమర్శలు చేయడం లేదు. తెలంగాణ ఇచ్చి రెండు సార్లు ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కి క్రెడిట్ ఇచ్చిన ప్రజలు, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ని మాత్రం చూడటం లేదు. ఈసారి ఎలాగైనా జనంలో ప్రూవ్ చేసుకోవాలని టీకాంగ్రెస్ పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పార్టీకి బేస్ ఉందంటే దానికి ప్రధాన కారణం క్యాడరే. పైన లీడర్లు ఎలా ఉన్నా కింద కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ జెండా భుజాన మోసి పార్టీ పేరు నిలబెట్టారు. చాలాసార్లు నేతలకు క్యాడర్ విలువైన సలహాలు కూడా ఇచ్చింది. కానీ నేతలెవరూ వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఇగోలకు పోయారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం పెరిగిన మాట నిజం. దీన్ని ఎంత వరకు క్యాస్ చేసుకుంటారనే ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ మొదట్నుంచీ బలంగా ఉంది. అంతెందుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనూ ఇక్కడ పర్వాలేదనిపించే స్థాయిలో సీట్లు గెలిచింది. ఉపఎన్నికల్లోనూ అప్పట్లో మంచి ప్రదర్శనే చేసింది. ఇవి చూసే తెలంగాణ ఇస్తే అధికారం ఖాయమనే అంచనాలకు వచ్చింది అధిష్ఠానం. కానీ 2014లో నేతల మధ్య విభేదాలతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం జరగలేదు. మొన్నటి ఎన్నికల్లోనూ బేస్ ను వాడుకునే దిశగా కార్యక్రమాల రూపకల్పన జరగలేదు. ఈసారి గతానికి భిన్నంగా వేర్వేరు చోట్ల భారీ సభలు, నేతల పాదయాత్రలతో మంచి ఊపు వచ్చింది. మొదట్నుంచీ ఇక్కడ పార్టీకి బేస్ ఉన్నా, దీన్ని ఎంతవరకు సజీవంగా ఉంచగలరనేదే అసలు సమస్య. అదే సమయంలో ఎన్నికల నాటికి బేస్ ను ఎంత పెంచుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది. ఇది ఏ మేరకు చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ గ్యారెంటీలు సక్సెస్
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథక కింద మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని హామీ ఇచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.15000 వేలు, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా ఇవ్వనుంది. భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తామని హమీ ఇచ్చింది. గృహజ్యోతి పథకం కింద గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాల ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనుంది. యువ వికాసం పథకం కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లించనున్నారు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించనుంది. చేయూత పథకం కింద వితంతు మహిళలకు , చేనేత కార్మికులకు, వికలాంగులకు , వృద్ధులకు ఆసరా పథకం కింద 4 వేల పింఛను అందించనుంది. మరోవైపు దళిత, గిరిజన బంద్ కింద దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. చేయూత పథకం కింద రూ.10లక్షల ఆరోగ్య బీమా అందజేయనుంది.