తెలుగుదేశం ఓట్ల కోసం బీజేపీ, బీఆరెస్ ప్రయత్నాలు- చంద్రబాబు అరెస్టుపై కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. అభ్యర్థుల ప్రకటన, బీ ఫారాలు అందజేస్తున్న బీఆర్ఎస్, ప్రత్యర్థుల కంటే దూకుడుగా వ్యవహరిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. అభ్యర్థుల ప్రకటన, బీ ఫారాలు అందజేస్తున్న బీఆర్ఎస్, ప్రత్యర్థుల కంటే దూకుడుగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక రౌండ్ ప్రచారం ముగించేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో తొలిజాబితాను రిలీజ్ చేసింది. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్లు కేటాయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతీ రెడ్డి కోదాడ నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. 6వేల దరఖాస్తులు వచ్చాయని ఘనంగా చెప్పుకున్నా, అభ్యర్థులను ఫైనలైజ్ చేయడంలో ఆలసత్వం వహిస్తోంది. అభ్యర్థుల ప్రకటన వ్యూహాత్మకమంటున్న బీజేపీ, ఎప్పుడు ప్రకటిస్తారో ఇప్పటి వరకు చెప్పలేదు.
అయితే అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో ప్రకటన ఎలా ఉన్నా మెజార్టీ ఓటు బ్యాంకు తమవైపు తిప్పుకునేందుకు మాత్రం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేసే ఓటు బ్యాంకును చేజారిపోకుండా పార్టీలు చూసుకుంటున్నాయి. అందుకే చంద్రబాబు అరెస్టు కూడా తెలంగాణలో కీలకమైన ప్రచారాస్త్రంగా మారిపోతోంది.
కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి పట్టు ఉండటంతో పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీ ఆ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనకు అవకాశం ఇవ్వకపోవడంతోపాటు కేటీఆర్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. జరిగిన డ్యామేజ్‌ను గ్రహించిన ఆయన తర్వాత సర్దుకున్నారు. ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న లోకేష్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆ బాధ తనకు తెలుసు అని అన్నారు. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉంటుందో ఆ పెయిన్ తాను అనుభవించానంటూ కామెంట్ చేశారు. ఆయన ఒక్కరే కాదు చాలా మంది బీఆర్‌ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. అరెస్టు చేసిన తీరు దారుణం అన్నారు. పనిలో పనిగా ఈ అరెస్టు వెనుక బీజేపీ ఉందని కూడా ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందనే ప్రచారం తీవ్రం అవ్వడంతో ఆ పార్టీ అలర్ట్ అయింది.
మరకను తొలగించుకోవడానికేనా ?
చంద్రబాబు అరెస్టు తర్వాత కేంద్ర పెద్దలను కలిసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రయత్నించారు. ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర నేతలెవరు లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో చంద్రబాబు అరెస్టు వ్యవహారం దుమారం రేపింది. బీజేపీ తెలిసే చంద్రబాబును అరెస్టు జరిగిందని, వైసీపీకి బీజేపీ సహకరిస్తోందని ప్రజలు నమ్ముతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రంలోని బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా లోకేశ్ కు రాయబారం పంపారు.
కేంద్ర పెద్దల ఆదేశాలతో లోకేష్‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి హోం మంత్రి అమిత్ షాతో కలిసేందుకు అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం ఇచ్చారు. అమిత్ షాను కలిసిన తర్వాత, కేంద్ర పెద్దలు పిలిస్తేనే కలిసినట్లు లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు అరెస్టుతో జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే లోకేశ్ ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. తమకు తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ఇలా చేసిందని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి, అత్యవసరం లోకేశ్ ను ఢిల్లీకి పిలిపించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ పోటీ చేస్తుందా ? చేయదా ?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉండటంతో, ఇప్పడందరి కళ్లు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ పై పడింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలుచుకుంటే, 2018లో 2 సీట్లు మాత్రమే గెలుపొందింది. అది కూడా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, ఆశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారా ? చేయరా ? పోటీ చేస్తే ఏ యే నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడును కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చించారు.
చెక్కుచెదరని ఓటు బ్యాంక్
తెలంగాణలో పార్టీని నడిపించే నేతలు లేకపోయినా ఇప్పటికి చెక్కుచెదరని తెలుగుదేశం పార్టీకి భారీగా ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్రం విడిపోయినా టీడీపీని అభిమానించే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని తిట్టిన బీఆర్ఎస్ నేతలు కొత్తగా చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఖమ్మం పర్యటనలో మంత్రి కేటీఆర్, తన పేరు కూడా తారక రామారావు అంటూ చెప్పుకొచ్చారు. పలువురు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును బహిరంగంగా ఖండించారు. చంద్రబాబు అనారోగ్యం పాలవడం బాధ కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు టీడీపీ ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.