who with whom In Guntur District : తేలిన లెక్కలు గుంటూరు సెంటర్‌లో పోటీ పడేది వీళ్లే
Andhra Pradesh News: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 16 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, తెనాలి మాత్రం జనసేనకు కేటాయించారు.
YSRCP And TDP Candidates In Guntur District : ఏపీలో వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసినా.. కూటమి తరపున అభ్యర్థుల ప్రకటన ఇంకా మిగిలే ఉంది. కూటమి లెక్కలు పూర్తయిన జిల్లాల్లో గుంటూరు ఒకటి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 16 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, తెనాలి మాత్రం జనసేనకు కేటాయించారు. గుంటూరులో వైసీపీ వర్సెస్ కూటమి.. ఎవరెవరు తలపడుతున్నారో ఓసారి చూద్దాం.
ఉమ్మడి గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
గుంటూరు తూర్పు-
వైసీరీ అభ్యర్థిగా షేక్ నూరి ఫాతిమా బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థిగా మహ్మద్ నజీర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు.
గుంటూరు పశ్చిమ
మంత్రి విడదల రజినిని చిలకలూరి పేటనుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు సీఎం జగన్. ఇక్కడ పిడుగురాళ్ల మాధవిని మంత్రిపై పోటీకి నిలబెడుతున్నారు చంద్రబాబు.
రేపల్లె-
డాక్టర్ ఈవూరు గణేష్ వైసీపీ అభ్యర్థి కాగా, అనగాని సత్యప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. 2019లో వైసీపీ హవాని తట్టుకుని నిలిచిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు.
వేమూరు(ఎస్సీ నియోజకవర్గం)-
వి. అశోక్ బాబు వైసీపీ అభ్యర్థి కాగా, టీడీపీ తరపున మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వేమూరి నాగార్జునను పక్కనపెట్టి అశోక్ బాబుని అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ.
మంగళగిరి-
ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు సీఎం జగన్. టీడీపీ తరపున నారా లోకేష్ ఇక్కడ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
బాపట్ల-
సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి వైసీపీ అభ్యర్థికాగా ఇక్కడ వేగేశ్న నరేంద్రకుమార్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు బాపట్లలో గెలిచిన రఘుపతి, హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు.
నర్సరావుపేట-
జి.శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అభ్యర్థికాగా టీడీపీ తరపున డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని మూడో విడతలో అభ్యర్థిగా ఖరారు చేశారు.
గురజాల-
కాసు మహేష్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాగా టీడీపీ తరపున యరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.
వినుకొండ-
సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ అభ్యర్థి కాగా.. టీడీపీ తరపున జీవీ ఆంజనేయులు పోటీ చేస్తున్నారు.
సత్తెనపల్లి-
సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ అంబటికి పోటీ ఇస్తున్నారు.
చిలకలూరిపేట
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి విడదల రజినిని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పంపించిన సీఎం జగన్, కె.మనోహర్ నాయుడుని వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు.
తెనాలి-
తెనాలి నుంచి అధికార వైసీపీ తరపున ఎ.శివకుమార్ పోటీలో నిలిచారు. ఈ సీటు కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించింది టీడీపీ. ఇక్కడ జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీలో నిలిచారు.
పొన్నూరు-
అంబటి మురళి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాగా, టీడీపీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర బరిలో నిలిచారు. ఈసారి ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగే అవకాశముంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య స్థానంలో అంబటి మురళి వైసీపీ తరపున బరిలో ఉన్నారు.
పెదకూరపాడు-
నంబూరి శంకర్ రావు ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాగా, భాష్యం ప్రవీణ్ ని టీడీపీ తమ అభ్యర్థిగా ఖరారు చేసింది.
ప్రత్తిపాడు(ఎస్సీ నియోజకవర్గం)-
ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బలసాని కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. మేకతోటి సుచరితను ఇక్కడినుంచి తాడికొండకు పంపించిన జగన్.. కిరణ్ ని రంగంలోకి దింపారు. టీడీపీ తరపున బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
తాడికొండ(ఎస్సీ నియోజకవర్గం)-
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి వెళ్లగా.. వైసీపీ నుంచి మాజీ మంత్రి మేకతోటి సుచరితను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు సీఎం జగన్. ఇక టీడీపీ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ బరిలో దిగారు. తాడికొండ నియోజకవర్గం అమరావతి పరిధిలోకి రావడంతో ఇక్కడ రాజధాని సెంటిమెంట్ పండుతుందేమోనని టీడీపీ ఆశిస్తోంది.
మాచర్ల-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి కాగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరపున ఇక్కడ పోటీ చేస్తున్నారు.