Delhi Police : ఆ ట్విట్టర్ ఖాతా నాది కాదు - ఢిల్లీ పోలీసులకు రిప్లయ్ పంపిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి రిప్లయ్ పంపారు. అమిత్ షా వీడియో షేర్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ను తాను నిర్వహించడం లేదన్నారు.
Revanth Reddy sent a reply to the Delhi Police : రిజర్వేఏషన్ల విషయంలో అమిత్ షా వీడియోను సర్క్యూలేట్ చేశారన్న అభియోగంపై ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. తెలంగాణ పీసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేసినందున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకటో తేదీన రావాలని అందులో పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి విచారణకు ఢిల్లీకి వెళ్లలేదు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు సమాధానం పంపించారు.
పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కావాలని కాంగ్రెస్ లీగల్ సెల్ లేఖలో కోరింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు రెండు వారాలు గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు రెండు వారాలు గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి లోకసభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారుని.. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండడంతో విచారణకు రాలేమని సమాధా నంపంపారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. అదే తెలంగాణ సీఎంవోతో పాటు వ్యక్తిగతంగా అనుముల రేవంత్ రెడ్డి ఖాతాను మాత్రమే నిర్వహిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా సిద్దిపేట సభలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు. అయితే వీడియోను ఎడిట్ చేసి అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్లుగా వీడియో క్రియేట్ చేశారు. దాన్ని దేశవ్యాప్తంగా సర్క్యూలేట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఉత్తరాదిరాష్ట్రాలకు చెందిన కొంత మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
తెలంగాణలో అమిత్ షా మాట్లాడినందున ఇక్కడి వారే ఎడిట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ వీడియో సర్క్యూలేట్ కావడంతో.. విపరీతంగా వైరల్ అయింది. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఇది సమాజంలో అశాంతిని రేపేలా ఉందని భావించి ఢిల్లీ పోలీసులు కేసులు పెట్టారు. తప్పుడు ప్రచారాలను చేసే వారిని వదిలి పెట్టబోమని అమిత్ షా, ప్రధాని మోదీ కూడా హెచ్చరించారు.
రేవంత్ రెడ్డితో పాటు నోటీసులు అందుకున్న వారంతా విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి ఢిల్లీ పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.