Elections Counting 2024: పోలింగ్ ఏజెంట్లూ ఈ విషయాలు తెలుసుకున్నారా?- మీరు చేసిన ఈ పొరపాటుకు మీ పార్టీయే ఓడిపోవచ్చు!
Postal Ballot Votes: తహసీల్దార్ కార్యాలయాల నుంచి పోస్టల్ బ్యాలట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు తొలుత ఈ ఓట్లే లెక్కించనున్నారు.
Postal Ballots: నువ్వా-నేనా అన్నట్లు సాగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి ఓటు ఎంతో కీలకంగా మారింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇతర ప్రాంతాల నుంచీ పెద్దఎత్తన ఓటర్లను రప్పించి ఓట్లు వేయించారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్థారించడంలో పోస్టల్ బ్యాలట్(Postal Ballot) ఓట్లు సైతం కీలకంగా మారడంతో...ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ పత్రాలతో కూడిన బాక్సులను గట్టి భద్రత మధ్య సోమవారం మధ్యాహ్నం కల్లా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించారు.
పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తరలింపు
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ముందుగానే గత నెల 5,6,7,8 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వేశారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ల(Postal Ballot)ను అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచారు. వీటిని సోమవారం మధ్యాహ్నం కల్లా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించి...అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలో పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆర్వో(R.O)లకు ఆదేశాలు అందాయి.ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాచారం అందింది.
కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలింపు
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి పోస్టల్ బ్యాలట్ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించాలని ఈసీ(E.C) అధికారులు ఆదేశించారు. ఈ బ్యాలట్ బాక్సులు భద్రపరిచిన గదుల వద్ద మూడు షిప్టుల్లో పోలీసులు భద్రత కల్పించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందుగా పోస్టల్ బ్యాలట్(Postal Ballot) ఓట్లు లెక్కించనున్నారు.
పోస్టల్ బ్యాలట్ ఓట్లే కీలకం
పోస్టల్ బ్యాలట్ ఓట్లు లెక్కింపు గురించి కౌంటింగ్ కేంద్రాకు హాజరయ్యే ప్రతి ఏజెంట్ కచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. ఏయే ఓట్లు చెల్లుతాయి...ఏయే ఓట్లు చెల్లుబాటు కావన్నది తెలిసి ఉండాలి.
1. బ్యాలెట్ పేపర్‌పై ఎవరికి ఓటు వేయకున్నా..ఒకటి కంటే ఎక్కువ మందికి ఓటు వేసినా ఆ పోస్టల్ బ్యాలట్ చెల్లదు
2. ఒకవేళ బ్యాలట్ పేపర్ చిరిగినా, గుర్తుపట్టలేనంతగా మారిపోయినా...బ్యాలట్ పేపర్‌పై ఏమైనా గుర్తులు రాసినా తిరస్కరిస్తారు.
3. నకిలీ బ్యాలట్ పేపర్లను సైతం తిరస్కరిస్తారు
ఈ విధంగా తిరస్కరించిన ఓట్లన్నింటినీ ఆర్వో పక్కన పెడతారు. ఈవీఎం(EVM) ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు..... తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో(R.O), అబ్జర్వర్లు ఒకొక్కటీ పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.
13A అత్యంత కీలకం
ఉద్యోగులు తన ఓటును కవర్ Aలో పొందుపరిచి దానికి డిక్లరేషన్ 13A జతచేసి ఈ రెండింటినీ కవర్ Bలో ఉంచి బ్యాలట్ బాక్స్‌లో వేస్తారు. బ్యాలట్ బాక్స్‌లో నుంచి కవర్ B తెరవగానే ముందుగా బ్యాలట్ పేపర్ ఉండే కవర్ 'A' ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. కవర్ 'B' తెరవగానే ఫారం 13 Cలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ A, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13A ఫారం ఉండాలి. ఈ 2 విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లనివిగా పరిగణించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత 13 A డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి. అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా... ఓటు పరిగణలోకి తీసుకోవాలని ఇటీవల ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానాలు ఉంటే ఏజెంట్లు ఆర్వోకు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చి చూసి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలట్ లెక్కింపు ప్రక్రియ మొదలువుతుంది.
లెక్కింపు ఇలా
కవర్ Bలో అన్నీ సరిగా ఉన్నట్లు సరి చూసుకున్న తర్వాతే కవర్ A ఓపెన్ చేస్తారు. అందులోని ఫారం B బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేస్తారు.13A పై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 B మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి. ఈరెండు నెంబర్లలో తేడా ఉండే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏజెంట్లు అంతా ఉదయం 6 గంటల కల్లా లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకోవాలి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 15 టేబుళ్లు సిద్ధం చేస్తారు. ఎదురెదురుగా ఏడేడు టేబుల్లు వేస్తారు. రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం మరో టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది.