Pawan Kalyan: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పవన్ భేటీ, కీలకాంశాలపై చర్చలు
Union Minister Gajendra Singh Shekawat : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ ఆదివారం సమావేశమయ్యారు. వీరి మధ్య అర్ధగంటపాటు భేటీ జరిగింది.
Pawan Kalyan Met With Union Minister Gajendra Singh Shekawat. Discussions Lasted For Half An Hour : రాష్ట్రంలో పోటీ చేయబోయే స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఐదు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) ఆదివారం విజయవాడకు వచ్చి ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనూహ్యంగా ఈ సమాశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. చంద్రబాబుతో కలిసి సోమవారం విజయవాడకు రావాల్సిన పవన్ కల్యాణ్ బీజేపీ కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రమే గన్నవరం విమానాశ్రయాని (Gannavaram Airport)కి చేరుకున్నారు. అక్కడి నుంచి బీజేపీ నేతలు సమావేశమైన నోవాటెల్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. వీరి మధ్య సుమారు అర్ధగంటపాటు భేటీ జరిగింది. కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత కోసమేనా
పొత్తులో భాగంగా జనసేన 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. ఇప్పటికే కొన్ని స్థానాలకు జనసేనాని పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీకి ఆరు ఎమ్మెల్యేలు, ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఆయా స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే జనసేన పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టతను తీసుకోవడం ద్వారా అభ్యర్థులను ప్రకటించే ఉద్ధేశంతో పవన్‌ను భేటీ ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కొన్ని చోట్ల బీజేపీకి సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరమైతే ఒకటి, రెండు సీట్లకు సంబంధించిన సర్ధుబాట్లపైనా ఈ సమావేశంలో పవన్, బీజేపీ నేతలు మధ్య చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాలను కోరేందుకు పవన్‌ను ఆహ్వానించారా..? లేక ఇంకేమైనా అంశాలపై చర్చ జరిగిందా..? అన్నది తెలియాల్సి ఉంది.
సీట్లపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్న పురందేశ్వరి
పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, పోటీ చేయబోయే సీట్లపైనా రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. పొత్తు ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. సీట్ల విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచకాలు అంతానికి అంతా కలిసి రావాలని ఆమె కోరారు. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ అభిప్రాయ సేకరణ చేపట్టనుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె వెల్లడించారు.
Also Read: ఎన్నికల ప్రచారానికి పవన్ ప్రణాళికలు- ఒకే రోజు 2, 3 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్