Mangalagiri Election Results 2024: పడ్డ చోటే పైకెగసిన కెరటం! మంగళగిరిలో లోకేశ్ జోరు మామూలుగా లేదు!
Mangalagiri Assembly Election Results 2024 Latest news: ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. గతంలో నారా లోకేశ్ ఓడిపోయి తాజాగా గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.
Nara Lokesh leading in Mangalagiri: క్రమంగా వెలువడుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు తమ ప్రతాపం చూపుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు దాదాపు 150కి పైగా స్థానాల్లో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ సీపీ మాత్రం 20 స్థానాలకే పరిమితం అయింది. ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం కూడా ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మాత్రం లోకేశ్ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు.
2019 ఎన్నికల్లో నారా లోకేశ్ ఇక్కడి నుంచే పోటీ చేసి 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేశారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్లతో మాత్రమే గెలిచారు. అయితే, గత ఎన్నికల్లో నారా లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయి భారీ అపవాదు మూటగట్టుకున్నారు.
అసలు మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు కంచుకోట కాగా, తర్వాత వరుసగా వైఎస్ఆర్ సీపీ గెలుస్తూ వచ్చింది. మంగళగిరి చరిత్రలో టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. అది కూడా టీడీపీ స్థాపించిన కొత్తలో 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం అధికం కావడంతో.. ఆ సీటును టీడీపీ కమ్యూనిస్టులకే కేటాయిస్తూ వచ్చింది. అలాంటిది 35 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ పోటీ చేయడం.. అందులోనూ నారా లోకేశ్ బరిలో ఉన్నప్పటికీ తొలి ఎన్నికల్లోనే ఓటమి ఎదురైంది.
అయితే, గత ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినప్పటికీ మంగళగిరిని ఏనాడూ వీడలేదు. పట్టుదలతో ఆ నియోజకవర్గంలోనే తిరిగారు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి సమస్యల్లో పాలు పంచుకున్నారు. అమరావతిని అన్యాయం చేసిన సందర్భంలోనూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మద్దతుగా నిలిచారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. అందుకే మంగళగిరి ఫలితంపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుంచి మంగళగిరి ఫలితం నారా లోకేశ్ కు అనుకూలంగా కొనసాగుతోంది.
మూడు రౌండ్లు ముగిసేసరికి 12,511 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంతకుముందు రెండు రౌండ్లు ముగిసేసరికి 8,411 ఓట్ల ఆధిక్యం ఉంది.