(Source: ECI/ABP News/ABP Majha)
Srikakulam News: లోకేష్ సభ సాక్షిగా ఎచ్చెర్ల టీడీపీలో బయటపడిన విభేదాలు
Lokesh Sabha In Etcherla : ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గత కొన్నాళ్లుగా కీలక నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. లోకేష్ సభ వేదికగా విభేదాలు బయటపడ్డాయి.
Lokesh Sankharavam Sabha In Etcherla : ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గత కొన్నాళ్లుగా కీలక నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరక్టర్, సీనియర్ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఇన్‌చార్జ్‌గా ఉన్న కళా వెంకటరావుకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని కలిశెట్టి అప్పలనాయుడు నియోజకవర్గంలో నడుపుతున్నారు. ప్రతి గ్రామంలోనూ రెండేసి వర్గాలుగా తెలుగుదేశం పార్టీ విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎచ్చర్ల నియోజకవర్గ పరిధిలోని లావేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ గురువారం సాయంత్రం జరిగింది. ఈ సభకు పార్టీ నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభా వేదిక వద్దకు వెళ్లే క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకునేంత స్థాయి వరకు వెళ్లడంతో పార్టీ నాయకులు అడ్డుకుని ఇరువర్గాలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు.
కలిశెట్టిని వెళ్లకుండా అడ్డుకోవడంతో
సభా ప్రాంగణం లోపలకు కలిశెట్టి అప్పలనాయుడు వెళ్లే క్రమంలో తన అనుచరులతో వేదిక వద్దకు వచ్చారు. అప్పటికే లోపల ఉన్న కళా వెంకటరావు వర్గీయులు ఆయన్ను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ పక్కనే కళా వెంకటరావు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు వెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పినట్టు అయింది. సుమారు 20 నిమిషాలపాటు ఇరు వర్గాలు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నాయకులు కల్పించుకుని కలిశెట్టి అప్పలనాయుడిని లోపలకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ జరుగుతున్నంత సేపు మాజీ మంత్రి కళావెంకటరావు అక్కడే ఉన్నారు. కలిశెట్టి అప్పలనాయుడును అడ్డుకుంటున్న తీరును ఆయన చూసినప్పటికీ ఎవరిని వారించలేదు. అక్కడికి బలవంతంగా వారి మధ్య నుంచి లోపలకు తోచుకుంటూ కలిశెట్టి అప్పలనాయుడు వచ్చారు.
బట్టబయలైన గొడవలు
ఎచ్చెర్లలో కళా, కలిశెట్టి వర్గీయులు మధ్య ఉప్పు, నిప్పుగా వ్యవహారంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పార్టీ ఇచ్చే కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తూ వస్తున్నాయి. లావేరు శంఖారావం సభ సందర్భంగా ప్లెక్సీలు, ఇతర ఏర్పాట్లు కూడా ఇరు వర్గాలు వేర్వేరుగా చేసుకున్నాయి. సభా వేదిక వద్దకు వెళ్లేందుకు కలిశెట్టి అప్పలనాయుడిని అడ్డుకోవడంతో గొడవ తారాస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటూ కలిశెట్టి ఇప్పటికే తన అనుచరులకు చెప్పారు. మాజీ మంత్రి కళా కూడా తాను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయమని నేతలకు స్పష్టం చేశారు. ఇరువురు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. వీరి మధ్య సఖ్యతను కుదుర్చి పార్టీ విజయానికి అగ్ర నాయకులు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. చూడాలి మరి పార్టీ అగ్రనాయకత్వం ఆ దిశగా దృష్టి సారిస్తుందో, లేదో.