KCR Politics : అభ్యర్థులకు బీఫాంతో పాటు రూ. 95 లక్షల చెక్కు - జగన్ తరహాలో బస్సు యాత్ర - కేసీఆర్ నిర్ణయం !
Telangana News : లోక్‌సభ అభ్యర్థులకు బీఫాంతో పాటు 95 లక్షల రూపాయల చెక్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల ప్రచారాన్ని బస్సు యాత్ర ద్వారా చేయాలని నిర్ణయించుకున్నారు.
KCR To Start BUS Yatra : భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులకు కూడా డబ్బులివ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి రూ. 95 లక్షల చెక్‌లు ఇవ్వనున్నారు కేసీఆర్. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రచారం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ కూడా బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారాయి. మెరుగైన ఓట్లు, సీట్లు సాధించకపోతే బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి బీజేపీ రెడీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒకటి, రెండు సీట్లు కూడా రావని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సవాళ్లు చేస్తున్నారు. పార్టీ నేతలు కూడా నమ్మకం కోల్పోయి వరుసగా గుడ్ బై చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంది. ఇప్పటికే పార్టీని అనేక రకాల సమస్యలు చుట్టుముట్టాయి. కేసీఆర్ తుంటి గాయం కారణంగా ప్రచారం నిర్వహించడం కూడా సమస్యగా మారింది. అియనా బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు.
మరో వైపు పార్టీ నేతలంతా తమ శక్తివంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ తో పాటు సీనియర్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సీట్లలో భారీ మెజార్టీ వచ్చిందని.. ఆయా స్థానాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేసీఆర్ కీలక అంశాలపై స్పందించడం లేదు. కాళేశ్వరం కుంగిపోవడం.. ఫోన్ ట్యాపింగ్ అంశాలపై తాను టీవీల్లో కూర్చుని ప్రజలకు అన్నీ చెబుతానన్నారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కవిత అరెస్టుపైనా ఆయన స్పందించలేదు. వీటన్నింటిపై బస్సు యాత్రలో మాట్లాడతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.