Janesna Candidate List: జనసేనకు కేటాయించిన సీట్లు ఇవేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్
Janasena Contesting Seats Confirm : సీట్ల సర్ధుబాటుపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టతకు అధినాయకత్వం వచ్చినట్టు చెబుతున్నారు.
Janasena Contesting Seats List : సీట్ల సర్ధుబాటుపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టతకు అధినాయకత్వం వచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే జనసేనకు పవన్ కల్యాణ్ 30కుపైగా స్థానాలు కోరగా, టీడీపీ 25 స్థానాలు వరకు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు ముగిసిన చర్చల్లో భాగంగా జనసేన పోటీ చేయబోయే సుమారు 20 స్థానాలపై ఇరు పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు చెబుతున్నారు. ఈ మేరకు జనసేనకు ఇచ్చే సీట్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఒక జాబితా కూడా చక్కెర్లు కొడుతోంది.
జనసేనకు ఇచ్చిన సీట్లు ఇవే
జనసేన పోటీ చేయబోయే స్థానాల్లో తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ నార్త్ లేదా సౌత్, చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, పి గన్నవరం, రాజానగరం, రాజమండ్రి(రూరల్), అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేదా చిత్తూరు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టత కోసం ఇరు పార్టీలు నేతలు మరోసారి కూర్చుని మాట్లాడే అవకాశముందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలను ఖరారు చేయగా, మిగిలిన మూడు స్థానాలపై ఇరు పార్టీల మధ్య కసరత్తు కొనసాగుతోంది. ఈ జిల్లాలో ఒకటి, రెండు సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశముంది. అనంతపురం జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ స్థానాలను జనసేన కోరుతుండగా, గోదావరి జిల్లాల్లో మరో మూడు సీట్లను జనసేన కోరుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
మూడు ఎంపీ స్థానాలు కేటాయింపు
జనసేనకు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. వీటిలో కాకినాడు, మచిలీపట్నం ఉన్నాయి. మరో స్థానాన్ని ఇవ్వనున్నారు. ఇందులో తిరుపతి, అనకాపల్లిలో ఏదో ఒక స్థానాన్ని కేటాయించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వస్తే.. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇరు పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్ధేశంతోనే ఇరు పార్టీల అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆదివారం ఒక్కరోజే రెండు సార్లు సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు వీరిద్దరూ చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు.
ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ
జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారు. మరో స్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాకినాడ ప్రాంత టీడీపీ లీడర్లతో ఇప్పటికే పలుమార్పు పవన్ సమావేశమయ్యారని తెలుస్తోంది. అక్కడి నుంచి పవన్ పోటీ చేసి విజయం సాధించిన తర్వాత ఆయన్ని కేంద్రమంత్రిని చేయాలని బీజేపీ భావిస్తోంది. అటు టీడీపీ కూడా ఆయన విజయానికి కృషి చేస్తామని చెబుతున్నట్టు టాక్.చంద్రబాబుతో భేటీ టైంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు.