Elections Results Day: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు?
Assembly Election Results 2024:ఉదయం 8 గంటల నుంచి హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.
Assembly Election Results 2024 : హర్యానా, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన బిగ్‌డే రానే వచ్చింది. మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెల్లడికానున్నాయి ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది. వచ్చే ఐదేళ్లలో హర్యానా, జమ్మూకశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించే క్షణాలు రానే వచ్చాయి.
హర్యానాలో మూడోసారి విజయం సాధించాలని నయాబ్ సింగ్ సైనీని సీఎంగా చేయాలని బిజెపి చాలా శ్రమించింది. బిజెపి ఎత్తుగడలను కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకొని హర్యానాలో పాగా వేసేందుకు ప్రతివ్యూహాన్ని రచించింది. పోస్ట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. అక్కడ కాంగ్రెస్‌కు మెజార్టీ వస్తుందని చెప్పాయి.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కోసం భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. కౌంటింగ్ వేదికల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ-కాంగ్రెస్ మధ్య మొదటి ప్రత్యక్ష పోటీ కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపై ఉంది.
బీజేపీ-కాంగ్రెస్ మధ్య ప్రధాన ప్రత్యక్ష పోటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్పీ, జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని హర్యానాలో పరీక్షించుకుంటున్నాయి.
హర్యానాలోని 22 జిల్లాల్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 93 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఇవి పూర్తైన 30 నిమిషాల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) లెక్కింపు చేపట్టారు. హర్యానాలో 90 నియోజకవర్గాల్లో 464 మంది స్వతంత్రులు, 101 మంది మహిళలు సహా మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ అక్టోబర్ 5న ఒకే దశలో ఓటింగ్ జరిగింది.
ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్‌కు అధికారం చేపడుతుందని చెబుతున్నప్పటికీ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మాత్రం కచ్చితంగా తాము విజయం సాధిస్తామని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉన్నారు.
ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమకు మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. ఐఎన్‌ఎల్‌డి-బిఎస్‌పి కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. జెజెపి నాయకుడు దుష్యంత్ చౌతాలా తమ కూటమికి మంచి సీట్లు వస్తాయన్నారు. హర్యానా ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ మద్దతు లేకుండా హర్యానాలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు.
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?
శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమని స్పష్టమైంది. హర్యానాలో ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2014 నుంచి ప్రతిపక్షంలో ఉంది. 2014లో 25 సీట్లు, 2019లో 31 సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనని అంచనాలు చెబుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఏంటీ?
ఆర్టికల్ 370 తర్వాత జమ్మూకశ్మీర్‌లో మొదటిసారిగా చారిత్రాత్మక పోలింగ్ జరిగింది. 2014 ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ BJP, కాంగ్రెస్-NC కూటమి, PDP మధ్య పోటీ ఉంది. 90 మంది సభ్యులున్న అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి: సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 పోలింగ్ జరిగింది.
ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేయగా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేశాయి. దశాబ్ద కాలంలో తొలిసారిగా పోలింగ్ జరిగిన జమ్మూ కశ్మీర్‌లో శనివారం ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. కాంగ్రెస్-ఎన్‌సి కూటమి ఆధిక్యత కనబరుస్తుందని అంచనా వేశాయి. బిజెపి వెనుకబడిందని తేలింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్, ఎన్‌సీ కూటమికి 35 నుంచి 50 సీట్లు రావచ్చని, పీడీపీకి 4 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది.