AP Election 2024: కౌంటింగ్‌కు ఇంకా 8 రోజుల సమయం - ఆ మూడు జిల్లాపైనే అధికారులు స్పెషల్ ఫోకస్
AP Election Counting: ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండడంతో ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దృష్ట్యా కౌంటింగ్‌కు గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది.

Counting Arrangements In Andhra Pradesh: ఏపీలో ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండడంతో ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దృష్ట్యా కౌంటింగ్‌కు గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కేంద్ర బలగాలతో భద్రత చర్యలు చేపట్టారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతి జిల్లా చంద్రగిరిపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తత వాతావరణమే కొనసాగుతోంది. మూడు నియోజకవర్గాల టీడీపీ, వైసీపీ నేతలపై పోలీసులు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో ఊళ్లు విడిచి వెళ్లారు. అంతేకాదు అల్లర్లలో పాల్గొన్నవారు, కారణమైన వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల ఎస్పీలపై వేటు వేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన రాజు, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. మూడు జిల్లాల్లో శాంతి భద్రతలు నియంత్రణలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన ఎస్పీలు అల్లర్ల మూకలపై కొరడా ఝలిపిస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఆ తర్వాత కూడా అల్లర్లు జరుగుతాయనే సమాచారం మేరకు ఎస్పీలు రంగంలోకి దిగారు.
ఎస్పీకి నేరుగా సమాచారం
ఎన్నికల ఉద్రిక్తలను తగ్గించడానికి తిరుపతి జిల్లా ప్రజలు సైతం పోలీసులతో చేతులు కలిపారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే నేరుగా ఎస్పీకి సమాచారం ఇస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు దగ్గరై.. జిల్లాలో లా అండ్ ఆర్డర్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాదు కౌంటింగ్ ప్రక్రియ ను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, రాజకీయ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. అంతే కాదు జిల్లా వ్యాప్తంగా 135 సమస్యాత్మక గ్రామాలలో పికెట్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలలో కవాతు కొనసాగిస్తున్నారు.
మేము సైతం అంటున్న ప్రజలు
పోలింగ్ సందర్భంగా చంద్రగిరి నియోజక వర్గంలో రామిరెడ్డిపల్లి, కూచివారిపాలెంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ రెండు పల్లెలు నిరంతరం పోలీసులు పహారాలో ఉన్నాయి. దీంతో తాము ప్రశాంతంగా ఉన్నామంటూ ఇక్కడ ప్రజలు ఎస్పీకి ఫోన్లు చేయడం ఆశ్చర్య కలిగించింది. పద్మావతి యూనివర్సిటీ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో నిరంతర పర్యవేక్షణ జరగుతోంది.
వారం రోజుల్లో ప్రశాంతంగా తాడిపత్రి
పోలింగ్ తర్వాత తాడిపత్రిలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. దీంతో జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని ఈసీ నియమించింది. బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే గౌతమి శాలి జిల్లాను ఆధీనంలోకి తీసుకొచ్చారు. అల్లరి మూకలను ఇప్పటికే అదుపులోకి తీసుకువచ్చారు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌పై చర్యలకు ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది ఎవరైనా రాజకీయ పార్టీలు, నేతలకు వత్తాసు పలుకుతూ పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.
పల్నాడు జిల్లాలో నేటికి 144 సెక్షన్
పల్నాడులో 14 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పల్నాడు ఎస్పీ మల్లిక గర్గ్ ఆధ్వర్యంలో సమస్యాత్మక గ్రామాల్లో కార్డెన్ సెర్చ్‌లు కొనసాగుతున్నా యి. జిల్లాలో 15 సమస్యాత్మక ప్రాంతాలు, 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రత పెంచామని చెప్పారు. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. దీంతో అక్కడ ఎస్పీ బిందుమాధవ్‌ను సస్పెండ్ చేసి మల్లి్క గార్గ్‌కు ఈసీ బాధ్యతలు అప్పగించింది. ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న పిన్నెల్లిని పట్టుకునేందుకు ఈమె నేపథ్యంలోనే ఎనిమిది బృందాలు పని చేశాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

