Karnataka Election 2023 : తెలంగాణ బీజేపీకి టానిక్ మిస్ - ఇప్పుడేం చేస్తే మళ్లీ ఊపొస్తుంది ?
తెలంగాణ బీజేపీకి కర్ణాటక నుంచి నిరాశజనక సందేశం. ఇప్పుడేం చేస్తారు?

Karnataka Election 2023 : దక్షిణాదిలో బీజేపీ జెండా ఎగరవేయబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ నేతలు కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు దక్షిణాదిలో చేతిలో ఉన్న రాష్ట్రం కూడా చేజారిపోయింది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే.. దక్షిణాదిలో ప్రజలు కూడా మోదీని రా ..రమ్మని ఆహ్వానిస్తున్నారని ప్రచారం చేసి హైప్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు బీజేపీ ఓటమి.. తెలంగాణ నేతలకూ మింగుడు పడటం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
కర్ణాటక పరాజయంతో తెలంగాణ బీజేపీ నేతల డీలా
కర్ణాటక పరాజయంతో తెలంగాణ బీజేపీ నేతలు డీలా పడిపోయారు. ఉదయం అంతాబీజేపీ గెలుస్తుందని ఎంతో ఉత్సాహంగా ఉన్న వారు.. ట్రెండ్స్ వచ్చే కొద్దీ నీరసపడిపోయారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సిద్ధం చేసుకున్న టపాసుల్ని లోపల పెట్టేశారు. పార్టీ నేతలు ఎవరూ పెద్దగా ఈ పరాజయంపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాలేదు. అక్కడ గెలిస్తే ఇక్క హైప్ ఎక్కించుకుందామని చాలా ప్లాన్లు రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడేమీ వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే వాట్ నెక్ట్స్ అనేది బీజేపీ నేతలకు చిక్కు సమస్యలా మారింది.
ఇక బీజేపీలో చేరికలు కష్టమే !
తెలంగాణ బీజేపీ చేరిక కోసం అర్రులు చాస్తోంది. బీజేపీ గెలవాలంటే ముందుగా బలమైన అభ్యర్థులు కావాలి. అలాంటి అభ్యర్థులు బీజేపీకి దొరకడం లేదు. ఒకటి, అరా చేరుతున్నా.. వారి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో గట్టిగా అంచనా వేసుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయని పోలోమంటూ బీజేపీలోకి నేతలు చేరడానికి వస్తారని అంచనా వేసుకున్నారు. ఇప్పుడు అలా పార్టీలు మారాలని అనుకుంటున్న నేతలు ఎవరైనా ఉంటే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం కనిపిస్తోంది కానీ బీజేపీ వైపు చూడరు. ఓ రకంగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
మత రాజకీయాల వర్కవుట్ కావని గుర్తిస్తారా ?
కర్ణాటకలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మత రాజకీయాలు చేసింది బీజేపీ. హనుమాన్ చాలీసాలు కూడాపెద్ద ఎత్తున చదివారు. అయితే ఇవేమీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంకా మైనస్ అయిందన్న ప్రచారం ఉంది. తెలంగాణలో టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రధానంగా మత రాజకీయాలనే నమ్ముకున్నారు. జగిత్యాలలో ఓ బస్సు సీటు విషయంలో ఇద్దరు ఆడవాళ్ల మధ్య జరిగిన గొడవను మత వివాదంగా మార్చి జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చారు. ఇలాంటివి ప్రజల్లో పాజిటివ్ తీసుకురాకపోగా నెగెటివ్ చేస్తాయన్న అభిప్రాయం బలంగా ఉంది.
కర్ణాటక పలితాలతో బీజేపీ తర్వాత వ్యూహాలను మరింత భిన్నంగా మార్చుకోవాల్సి ఉంది.





















