Rahul Gandhi: 'ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష' - రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీయేనన్న రాహుల్ గాంధీ
Telangana News: బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. నిర్మల్ లో కాంగ్రెస్ జన జాతర సభలో పాల్గొన్న ఆయన.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi Slams Bjp In Nirmal Jana Jathara Sabha: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందని.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిర్మల్ లో (Nirmal) ఆదివారం నిర్వహించిన జన జాతర సభలో (Jana Jathara Sabha) మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. పేదల హక్కులను హరించి.. ధనికుల ప్రయోజనాలే ఆ పార్టీ లక్ష్యమని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని.. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే మాత్రం ఎవరూ నిలదీయడం లేదని అన్నారు. ఈ ఎన్నికలు 2 సమూహాల మధ్య జరుగుతున్నాయని.. ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్, మరోవైపు దాన్ని మార్చే సమూహం ఉందని చెప్పారు. బీజేపీ సంపన్నులకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని.. ఆ డబ్బులతో దేశంలోని పేదలకు ఒక్కొక్కరికీ రూ.25 వేలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
'పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష'
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేద కుటుంబాలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 'మహిళలకు ఆర్థిక సాయం అందిస్తాం. దేశంలో నిరుద్యోగ సమస్య తీరుస్తాం. ప్రతి గ్యాడ్యుయేట్ కు ఉద్యోగం కల్పిస్తాం. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తాం. ఓ ఏడాది శిక్షణతో పాటు రూ.8,500 భృతి అందిస్తాం. అటవీ భూములపై మొదటి హక్కులు ఆదివాసులవే. ఆ భూ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. కులగణన, ఆర్థిక సర్వే చేస్తాం. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం. ఉపాధి హామీ వేతనాన్ని రూ.400కు పెంచుతాం.' అని రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మట్టుబెట్టేందుకు చూస్తోందని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ అన్నారు.
బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు
నిర్మల్ జన జాతర సభలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. 'ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశాం. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. ఆదిలాబాద్ (Adilabad) అంటే నాకు ప్రత్యేక అభిమానం. అందుకే దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆదిలాబాద్ లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తాం. ఆగస్ట్ 15లోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫి చేస్తాం. ఈ నెల 9లోపు రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తాం.' అని సీఎం స్పష్టం చేశారు.