Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ జయభేరి - రాహుల్ రికార్డ్ బ్రేక్ చేసి చారిత్రాత్మక గెలుపు
Wayanad By Election: కేరళ వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ జయభేరి మోగించారు. సమీప ప్రత్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో రికార్డు విజయాన్ని అందుకున్నారు.
Priyanka Gandhi Won In Wayanad By Election: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఘన విజయం సాధించారు. కేరళ వయనాడ్ (Wayanad) లోక్ సభ ఉప ఎన్నికలో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేసి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 'అభివృద్ధి గురించి ఆలోచించి ప్రజలు ఓటేస్తారని భావించాను. కానీ, పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.' అని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ అన్నారు.
కాగా, వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఆ స్థానాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఝార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటుగా ఈ నెల 13న ఇక్కడ పోలింగ్ జరిగింది.
స్పందించిన రాబర్ట్ వాద్రా
ప్రియాంక గాంధీ విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. 'ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు శ్రమిస్తారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష, ఆశయంతోనే ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. రికార్డు విజయం సాధించడంపై అభినందనలు.' అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.
అటు, మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల సరళిపైనా ఆయన స్పందించారు. 'మహారాష్ట్ర ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించాలి. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి. ఝార్ఖండ్ ఫలితాలపై సంతోషంగా ఉంది. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అధికార పార్టీకి బీజేపీ ఇబ్బందులు కలిగించింది. అయినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు.' అని పేర్కొన్నారు. రాజకీయాల్లో చురగ్గా పాల్గొనడంపై స్పందించిన వాద్రా.. ప్రజల కోసం తాను నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని చెప్పారు. అలాంటప్పుడు పార్లమెంట్‌లోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రియాంక పార్లమెంట్‌లో ప్రజల గళాన్ని వినిపించనున్నారని.. తనకూ అలాంటి సమయం రావొచ్చని చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందని పేర్కొన్నారు.