Visakha North Constituency: విశాఖ నార్త్‌లో ఆ ఇద్దరి మధ్య పోటీ- మిగతా పార్టీలన్నీ సైడ్ అయిపోవాల్సిందేనా!
Vishaka North Constituency: విశాఖ నగర పరిధిలోని నార్త్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది. వైసీపీ నుంచి కేకే రాజు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారు.
BJP Vs YSRCP In Visakha North: విశాఖ నగర పరిధిలోని నార్త్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోస్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టీడీపీకి పోటీ చేసే స్థాయిలో అభ్యర్థి కూడా లేరు. వైసీపీ ఇన్‌చార్జ్‌గా కేకే రాజు వ్యవహరిస్తుండగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ ఇక్కడ పని చేస్తూ వస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు దిగడం దాదాపు ఖాయమైంది. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారన్న దానిపై స్పష్టత లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమిగా అభ్యర్థిగా 2014 మాదిరిగానే విష్ణుకుమార్ రాజు బరిలో నిలుస్తారని చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం పోటీ ఆసక్తికరంగా ఉంటుందని స్థానిక ప్రజలతోపాటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తీవ్రమైన పోటీకి అవకాశం
విశాఖ నార్త్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. కానీ, ఇక్కడ ప్రజల్లో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటున్నారన్న పేరును కేకే రాజు సంపాదించుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అధికార పార్టీ అభ్యర్థి కావడంతో ఓడిపోయినప్పటికీ.. ఆయనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లి వివరిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరును తెచ్చుకున్నారు. ఇక, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు మరోసారి ఇక్కడి నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీలో మరెవరూ చేయని రీతిలో విమర్శలు గుప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నారు. టీడీపీతో పొత్తు కోరుకునే నేతల్లో ఈయన ఒకరు. పొత్తులో మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారమూ జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా పని చేయడం, వివాద రహితుడు కావడం, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు విష్ణుకుమార్‌రాజుకు ఉంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్లు కావడంతో పోటీ హోరాహోరీగా ఉంటుందని చెబుతున్నారు. ఆర్థికంగానూ ఇద్దరూ స్థితిమంతులు కావడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న కేకే రాజు.. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఓడిపోయిన తొలి రోజు నుంచే ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
జనసేన స్పందన ఏమిటో
గడిచిన ఏడేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను మోస్తున్నారు పసుపులేటి ఉషాకిరణ్. గత ఎన్నికల్లోనూ భారీగానే ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, పొత్తులో ఈ సీటు రావడం కష్టమని చెబుతున్నారు. కానీ, ఆమె మాత్రం తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్కపోతే పార్టీలోనే ఉంటారా..? లేక మరో దారి చూసుకుంటారా..? అన్న దానిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా ఉషా కిరణ్ పోటీ చేస్తారంటూ ఆమె అనుచరులు చెబుతున్నారు. కానీ, పొత్తు లెక్కలతో చూస్తే.. వీరి లెక్క తప్పేట్టు కనిపిస్తోందని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కానీ, ఇప్పటికిప్పుడు ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే.. కేకే రాజు, విష్ణు కుమార్ రాజు పోటీ ఖాయమని, వీరిద్దరే అభ్యర్థులు అయితే మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి వైసీపీ జెండా ఎగురేసి తన చిరకాల వాంఛను కేకే రాజు తీర్చుకుంటారా..? మరోసారి గెలిచి అసెంబ్లీలో విష్ణు కుమార్ రాజు అడుగుపెడతారా..? అన్నది వేచి చూడాల్సిందే.