CM Jagan On Results: ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాల్లేవు - ఎన్నికల ఫలితాలపై జగన్ వ్యాఖ్యలు
AP CM Jagan Emotional Speech : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. వరో మోసం చేశారు.. ఎవరో అన్యాయం చేశారో అనొచ్చు కానీ ఆధారాల్లేవన్నారు.
CM Jagan On Assmbly Election Results 2024 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో మోసం చేశారు.. ఎవరో అన్యాయం చేశారో అనొచ్చు కానీ ఆధారాల్లేవని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. తాను పరిపాలనలో లక్షల మందికి మేలు చేశానని.. కోట్ల మందికి డబ్బులు ఇచ్చానని కానీ ఆ ఓట్లన్నీ ఏమైపోయాయో తెలియదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే తనకు కష్టాలు కొత్త కాదని.. ప్రతిప్కషంలో ఉండి పోరాడి.. ఈ స్థాయి నుంచి మళ్లీ ఎదుగుతామని చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ తాను ప్రజలకు అందించిన పథకాల గురించి చెబుతూ.. ఆ ఓట్లన్నీ ఏమయిపోయాయోనని అనుమానం వ్యక్తం చేశారు. అక్క , చెల్లెమ్మలకు ఎంతో మేలు చేశామని.. అమ్మఒడి డబ్బులు ఇచ్చిన లక్షల మంది మహిళల ఓట్లు ఎటు పోయాయో తెలియడం లేదన్నారు. అలాగే చేయూతతో పాటు పలు పథకాల గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఫలితాల విషయంలో ఏ మాత్రం నమ్మకంగా లేరని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. బహుశా ఆయన ఈవీఎంలపై అనుమానంతో ఉండవచ్చని అంటున్నారు. కానీ ఆధారాల్లేవని కూడా ఆయనే చెప్పారు.
అమ్మఒడి, 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. ప్రజలకు మంచి చేయాలని అడుగులే వేశాం. అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో.. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మేలు చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ.. వారి ఇంటికి పంపే వ్యవస్థను కూడా తీసుకువచ్చాం. గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు.. చాలిచాలని పెన్షన్‌తో ఇబ్బంది పడే వారు. కానీ వారికి అధిక పెన్షన్ ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి పొదుపు అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ.. వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ.. ఇచ్చిన ఏ మాట తప్పకుండా.. అన్ని రకాలుగా వారికి అండగా ఉంటూ.. ఆసరాకు తోడుగా ఉన్నాం. సున్నా వడ్డీతో అండగా ఉన్నాం. చేయూతతో భరోసా కల్పించాం. వారి ప్రేమాభిమానాలు ఏమాయ్యాయో.. అని అనుమానం వ్యక్తం చేశారు.
ఎవరెన్ని చేసినా తమకు ఉన్న నలభై శాతం ఓట్లను తగ్గించలేకపోయారని.. తమకు కష్టాలు కొత్త కాదు కాబట్టి.. మళ్లీ పోరాడతామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని తన రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నానన్నారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా.. పోరాడతానని జగన్ చెప్పుకొచ్చారు.