TDP News: జగన్ కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి- అభ్యర్థులకు చంద్రబాబు సూచనలు
TDP Janasena First List : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి కీలక సూచనలు చేశారు.
![TDP News: జగన్ కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి- అభ్యర్థులకు చంద్రబాబు సూచనలు ChandraBabus advises to the TDP Janasena candidates who have got ticket TDP News: జగన్ కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి- అభ్యర్థులకు చంద్రబాబు సూచనలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/25/c4c1b60fb4acaccab7f9088970bfff641708872370123930_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ChandraBabus Advises To The TDP Candidates: తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఇరు పార్టీలు శనివారం ప్రకటించాయి. ఈ జాబితా ప్రకటన తరువాత ఇరు పార్టీల్లో ఆశావహులైన అభ్యర్థులు, వారి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu) తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అభ్యర్థులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు.. వారికి కీలక సూచనలు చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా అభ్యర్థులను ప్రకటించామని, పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్ధతు, ఆమోదం ఉండాలన్న ఉద్ధేశంతో సరికొత్త విధానంలో అభ్యర్థులు ఎంపిక జరిగినట్టు ఆయన వెల్లడించారు. కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు అనేక సర్వీలను పరిశీలించి, సుదీర్ఘ కసరత్తు తరువాత అభ్యర్థులను ప్రకటించినట్టు ఆయన తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో ఈ తరహా ప్రయత్నం ఇప్పటి వరకు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక్క సీటు ఓడిపోవడానికి వీలు లేదని, ఈ ఎన్నికలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు భవిష్యత్‌పై నమ్మకం కలిగేలా నాయకత్వం వహించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. సీట్లు రాక అసంతృప్తితో ఉన్న నేతల ఇళ్లకు ఒకటికి పదిసార్లు వెళ్లి స్వయంగా కలిసి రావాలని సూచించారు.
గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక
రాష్ట్ర ప్రయోజనాలతోపాటు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఎంపికలు సాగినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ అహంకారమే అతని పతనానికి నాంది పలుకుతుందని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించిన చంద్రబాబు.. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రజల్లో ఉండాలని నేతలకు స్పష్టం చేశారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపైనే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడని, సిద్ధం అని సభలు పెడుతున్న అభ్యర్థులను మాత్రం ప్రకటించుకోలేకపోయాడని స్పష్టం చేశారు. సీట్లు ఇచ్చేశారని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కాదా అని సులభంగా తీసుకోవద్దని నేతలను హెచ్చరించిన చంద్రబాబు.. చివరి నిమిషం వరకు ప్రజల్లో ఉంటూ కష్టపడాలని సూచించారు. నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోవాలని సూచించారు. అభ్యర్థిని తానే అన్న ఈగోతో వ్యవహరిస్తే కుదరదని, తటస్తులను కూడా కలవాలని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్ధతు పొందాలని చంద్రబాబు అభ్యర్థులకు దిశా, నిర్ధేశం చేశారు. జగన్ చేసే కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న చంద్రబాబు.. మిత్రపక్షమైన జనసేన నేతలను కలుపుకుని వెళ్లాలని సూచించారు.
వైసీపీ వారిని పార్టీలోకి ఆహ్వానించండి
గ్రామ స్థాయిలో జగన్ పాలనపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అటువంటి వారిని గుర్తించి పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ ఎన్నికల్లో గెలిచేందుకు తన పాలనను నమ్ముకోలేదని, దొంగ ఓట్లు, అక్రమాలు, డబ్బును నమ్ముకున్నాడని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని, ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలని సూచించారు. ఎవరూ ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తాడని, వీటికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు చంద్రబాబు స్పష్టం చేశారు. సీట్లు పొందిన నేతలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన చంద్రబాబు.. వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని సూచించి ముగించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)