Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Telangana News: తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. వెంటనే అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే చర్చించాలని ఆదేశాలు ఇచ్చింది.
Election Comission Green Signal To Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కొన్ని షరతులు విధించింది. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతు విధించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. అలాగే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులెవరూ ఈ భేటీకి వెళ్లకూడదని ఆదేశించింది. తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే మంత్రి వర్గంలో చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది.
అనుమతి లేక భేటీ వాయిదా
కాగా, రైతు రుణమాఫీ, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా మంత్రులు కూడా శనివారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చి రాత్రి వరకూ ఎదురు చూసిన ఈసీ అనుమతి ఇవ్వలేదు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా.. పునర్విభజన చట్టంలో ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలను సైతం మంత్రి మండలి భేటీలో చర్చించాలని భావించారు. అయితే, ఈసీ అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా వేశారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర మంత్రులతోనూ చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం ఆరా తీశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ వెంట ఉన్నారు. నెల రోజుల్లో (జూన్‌లో) వర్షాకాలం ప్రారంభం కానుండగా.. తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, సోమవారం లోపు కేబినెట్ భేటీకి ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈసీ అనుమతి ఇవ్వడంతో ఇక కేబినెట్ భేటీకి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే, ఎన్నికల సంఘం ఆదేశాలతో పలు అంశాలపై చర్చ ఉండబోదని తెలుస్తోంది.
Also Read: Warangal News: గుడ్‌న్యూస్! తెలంగాణలో మరో ఎయిర్ పోర్టుకు ముందడుగు - రేవంత్ రెడ్డి రివ్యూ