బీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తున్న నేతలు- ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రాజీనామా- గుడ్‌బై చెప్పిన నారాయణరావు
బోధన్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆయన ఇవాళ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఉదయం రేవంత్ నివాసానికి వచ్చి రాజకీయాలపై చర్చించారు.
పోలింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ తెలంగాణ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. ఒకేరోజు ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేశారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితోనే వీళ్లద్దరు పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది.
బోధన్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆయన ఇవాళ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఉదయం రేవంత్ నివాసానికి వచ్చి రాజకీయాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన బాపురావును కాదని ఇప్పుడు వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఆయనకు బదులు అధినాయకత్వం అనిల్ జాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో బాపురావు పార్టీ మారాలని నిర్ణయించారు.
రేవంత్‌తో మాట్లాడిన అనంతరం ఆయనకు బోధన్ టికెట్ కన్ఫామ్ అయినట్ట ప్రచారం నడుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. రేపు రాహుల్, ప్రియాంక సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయన ముధోల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.
ఈసారి 8 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దొరకలేదు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు టికెట్ నిరాకరించారు. దీంతో వీళ్లలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే కాదు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పార్టీని వీడుతున్నారు. స్థానికంగా నల్గొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్‌తోపాటు మరికొందరు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
శేరిలింగపల్లి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తన భార్యతోకలిసి కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ సమక్షంలో ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు.