Atmakur By Election YSRCP Vs BJP : లక్ష మెజార్టీ కన్నా తగ్గితే బీజేపీదే నైతిక విజయమా ? ఆత్మకూరు ఫలితం రాజకీయం మారుస్తుందా ?
ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అంచనా కన్నా మెజార్టీ తగ్గించగలిగితే తమదే నైతిక విజయమని బీజేపీ భావిస్తోంది. కంచుకోటలో వైఎస్ఆర్‌సీపీ ప్రలోభాలకు సైతం దిగడం తమ మొదటి విజయంగా అంచనా వేసుకుంటోంది.,
Atmakur By Election YSRCP Vs BJP : ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. నిజానికి ఫలితంపై ఎవరికీ డౌట్ లేదు. ఎందుకంటే ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి కుటుంబం కంచుకోట. అంతే కాదు ప్రతీ ఊరులోనూ వారికి అనుచరగణం ఉంది. అంతకు మించి మేకపాటి గౌతంరెడ్డి చనిపోవడం వల్ల వచ్చిన ఉపఎన్నిక. సానుభూతి కూడా వారి వైపే ఉంటుంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. జనసేన కూడా అంతే. ఇక పోటీలో మిగిలింది బీజేపీ మాత్రమే.
క్యాడర్ లేకపోయినా ఆత్మకూరులో గట్టిగా నిలబడిన బీజేపీ
బీజేపీకి ఆత్మకూరులో ఎలాంటి బలం లేదు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కీలక నేతగా ఉన్న కర్నాటి ఆంజనేయరెడ్డి పోటీ చేసిన వచ్చంది 2314 ఓట్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్‌సీపీకి అంతా నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ పోలింగ్ ముగిసే సరి మరీ అంత ఈజీ కాదనే పరిస్థితి. పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీ నేతలు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. చివరి క్షణం వరకూ ఉండి ఏ మాత్రం తేడా రాకుండా కష్టపడ్డారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డబ్బులు కూడా పంచారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కంగారు పడుతోందన్న విషయం అర్థమైపోయింది. పోటీలో ప్రధానంగా బీజేపీ మాత్రమే ఉన్నా అధికార పార్టీ ఎందుకు టెన్షన్ పడిందంటే బీజేపీ నేతల పోరాట పటిమ అనుకోవచ్చు.
ప్రలోభాలకు సైతం దిగిన వైఎస్ఆర్‌సీపీ
బలం లేదని.. క్యాడర్ లేదని ఆ పార్టీ నేతలు అనుకోలేదు. పార్టీ ముఖ్య నేతలంతా ఓ స్ట్రాటజీ ప్రకారం ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలంతా ఆత్మకూరులో ప్రచారం చేశారు. బలం లేదు కదా అని ఎవరూ లైట్ తీసుకోలేదు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ఇంటింటి ప్రచారం చేశారు. మామూలుగా ఏకపక్షంగా జరుగుతుందనుకున్న ఎన్నిక అయితే నామినేషన్ వేసి సైడ్ అవుతారు. కానీ చివరి వరకూ పోరాడాలన్న లక్ష్యాన్ని వీరు కనబర్చారు. ఫలితంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రలోభాలకు కూడా దిగాల్సి వచ్చింది. అంతిమంగా ఫలితం మారకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ మెరుగుపడిందన్న ఓ సంకేతాలను మాత్రం ఈ ఉపఎన్నిక పంపుతున్న అభిప్రాయం వినిపిస్తోంది.
వైఎస్ఆర్‌సీపీ మెజార్టీని తగ్గిస్తే బీజేపీదే నైతిక విజయం
విపక్షాలు పోటీలో లేవు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడింది బీజేపీనే అన్న భావన ఓటర్లలోకి వచ్చింది. అది ఓట్ల రూపంలో కనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ లక్ష ఓట్ల మెజార్టీని పెట్టుకుంది. ఆ మెజార్టీని సాధించకపోతే విజయాన్ని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు కూడా ఆస్వాదించే అవకాశం లేదు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ మెజార్టీ లక్ష ఓట్ల కంటే తగ్గితే అది బీజేపీ నైతిక విజయం అయ్యే చాన్స్ ఉంది. అందరూ వెనుకడుగు వేసినా బరిలోకి దిగి వైఎస్ఆర్‌సీపీని నిలువరించామన్న స్థైర్యం బీజేపీ శ్రేణుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అధినేత ఆశించిన మెజార్టీని సాధించకుండా బీజేపీ అడ్డుకుంది. ఇక్కడా అదే చేయగలిగితే బీజేపీ బలంగా ముందడుగు వేసేందుకు సిద్ధమయినట్లే అనుకోవచ్చు.