AP Elections 2024: ఎన్నికల కౌంటింగ్ - జిల్లాలకు ప్రత్యేక అధికారులు, డీజీపీ కీలక నిర్ణయం
Andhra Pradesh News: జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఈసీ, ఏపీ పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు.
AP DGP Appointed Special Officers To Districts: ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం కూడా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించింది. ఈ మేరకు 56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా పల్నాడు జిల్లాకు 8 మంది పోలీస్ అధికారులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు వెంటనే ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సున్నితమైన సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని నిర్దేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పల్నాడులో 144 సెక్షన్
మరోవైపు, పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతోంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంచేందుకు జూన్ 5 వరకూ ఇది కొనసాగుతుందని ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ జిల్లాలోని అన్ని ముఖ్య నియోజకవర్గాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అన్ని గ్రామాల్లోనూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అటు, సిట్ కేసుల్లో శనివారం ఒక్క రోజే 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనల కేసులకు సంబంధించి నరసరావుపేట సబ్ డివిజన్‌లో 01, సత్తెనపల్లి సబ్ డివిజన్‌లో 46, గురజాల సబ్ డివిజన్‌లో 27 మందిని.. మొత్తం 74 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో భద్రతను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అటు, అనంతపురం జిల్లాలోని కౌంటిగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తూ.. కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. జిల్లాకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించారు.
మూడంచెల భద్రత
ఈవీఎంలు భద్రపరిచిన కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ సహా.. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో భద్రతను పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లోని అన్ని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్రాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్, టేబుళ్ల నిర్వహణ, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఈవో ఎంకే మీనా ఆదేశించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, ఏజెంట్లకు, నియోజకవర్గం అభ్యర్థులకు అల్బాహారం, భోజనం, మంచినీళ్లు సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదు. వీటిని భద్రపరిచేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు.