AP Elections Counting Updates: సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లకు హెచ్చరిక - తేడా వస్తే రౌడీషీట్ ఖాయం
Andhra Pradesh Counting Updates: సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రెచ్చగొట్టేలా పోస్టులు ఉంటే మాత్రం రౌడీషీట్ ఖాయమని చెబుతున్నారు.
![AP Elections Counting Updates: సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లకు హెచ్చరిక - తేడా వస్తే రౌడీషీట్ ఖాయం AP Police advise social media users and admins not to post provocative content on social media during the lok Sabha and assembly election counting time of Andhra Pradesh elections 2024 AP Elections Counting Updates: సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లకు హెచ్చరిక - తేడా వస్తే రౌడీషీట్ ఖాయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/03/73884d46f4a77b999070058c24edea1e1717403355875215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh Assembly And Lok Sabha Elections Counting News: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో ఈవీఎంలు తెరుచుకోనుంది. ప్రజలు తమ అభిప్రాయాలను అందులో ఉంచారు. అది ఎవరి పక్షమో గంటల వ్యవధిలోనే తేలిపోనుంది. ఈలోపే చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి శిబిరంపై విమర్శలు కురిపిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివే పెను ప్రమాదానికి కారమణవుతాయని గ్రహించిన పోలీసులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.
కౌంటింగ్ టైంలో పోలీసులు సోషల్ మీడియాలో నిఘా పెట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. గీత దాటితే తాటతీస్తామంటున్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ప్రత్యర్థులను రెచ్చగొట్టినా, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమంటున్నారు. కచ్చితంగా చర్యలు ఉంటాయని అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడటం, రెచ్చగొట్టే కామెంట్స్ చేిన వారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివిధ గ్రూప్‌లను క్రియేట్ చేసి నిర్వహిస్తున్న అడ్మిన్‌లు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తప్పుడు పోస్టులను నియంత్రించాల్సి ఉంటుందని అంటున్నారు. లేకుంటే IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించిన వారు మరింత సంయమనం పాటించాలని రెచ్చగొట్టే పోస్టులు పెట్టి కష్టాలు కొనితెచ్చుకోవద్దని హితవుపలుకుతున్నారు. ఏమైనా తేడాగా పోస్టులు కనిపిస్తే PD యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడేది లేదని అంటున్నారు. అలాంటి పోస్టులు ఎవరి ప్రోత్సాహంతో పెడుతున్నారు. కారణాలు ఏంటని పూర్తిగా విచారించి భాగమైన వారందరిపై కూడా కేసులు బుక్ చేస్తామని చెబుతున్నారు.
రెచ్చగొట్టే కామెంట్స్‌తోపాటు ప్రత్యర్థులను ఆగ్రహం తెప్పించే పోస్టులు, ఫొటోలు, వీడియోలు, స్టేటస్లు పెట్టుకున్నా ప్రమాదకరమని అంటున్నారు. అందుకే కేవలం అడ్మిన్‌లు మాత్రమే పోస్టులు పెట్టుకునేలా సెట్టింగ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. అలాంటివి మీకు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోవద్దని అంతా అలర్ట్‌గా ఉండాలని అంటున్నారు. సోషల్ మీడియాపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందని కచ్చితంగా ఏమాత్రం ఏమరుపాటుగా ఉంటే కేసుల్లో ఇరుక్కొని జీవితాతం స్టేషన్లు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)