ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
ఏడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏడుగురు బరిలో నిలబడితే... ఒక స్థానం కోసం టీడీపీ పోటీ పడింది.
ఎన్నికల సంఘం చెప్పిన సమయానికి కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం మూడు గంటల వరకు ఓటు వేసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా ముందుగానే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా సాగింపోయింది ప్రక్రియ.
175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివిధ కారణాలతో వివిధ రోజులుగా సభకు దూరంగా ఉంటున్న వాళ్లు కూడా అసెంబ్లీకి వచ్చి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. అలాంటి వారిలో ఒకరు గంటా శ్రీనివాసరావు అయితే రెండో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.
పార్టీల మైండ్‌గేమ్‌తో చాలా టెన్షన్ పెట్టిన ఎన్నికల ఫలితం నాలుగు గంటల తర్వాత తెలియనుంది. అప్పటి వరకు ఎవరు ఎటు వేశారు.. ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారంటూ అధికార పార్టీలో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఈ ఎన్నికతో తెరదించాలని జగన్ భావిస్తున్నారు.
ఎంతో చర్చకు దారి తీసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పూర్తైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి ఓటు వేయడంతో ప్రక్రియ ప్రారంభమైంది. ఓ వైపు అసెంబ్లీ నడుస్తుండగానే ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేసి వెళ్లారు. టీడీపీ సభ్యులంతా చంద్రబాబుతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి అంతా కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏడుగురు బరిలో నిలబడితే... ఒక స్థానం కోసం టీడీపీ కూడా పోటీ పడింది. ఆ పార్టీ తరఫున పంచుమర్తి అనూరాధ పోటీలో నిలిచారు. వైసీపీ తరఫున బరిలో జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు.
తనను నిండు శాసనసభలో అవమానించారని కన్నీళ్లు పెట్టుకన్న చంద్రబాబు... ఇకపై గెలిచే సభలో అడుగుపెడతానంటూ 2021 నవంబర్ 19న శపథం చేశారు. అన్నట్టుగానే అప్పటి నుంచి సభకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సభలో అడుగు పెట్టారు.
వైసీపీ ఎమ్మెల్యే అప్పల నాయుడు కుమారుడి పెళ్లి ఉంది. ఆ పనుల్లో బిజిగా ఉన్న ఆయన కూడా వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఆయన వైసీపీ స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేసింది. తన కుమారుడి పెళ్లిన అయిన తర్వాత స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చి ఓటు వేయించింది.
ఉదయం నుంచి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. గంటా రాజీనామా ఆమోదించారని వార్తలు హల్ చల్ చేశాయి. చాలా కాలంగా శాసనభకు రాని ఆయన ఇవాళ వచ్చి ఓటు వేసి వెళ్లారు. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఒక్క ఓటే కానీ చాలా ఎఫెక్టివ్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసి ఉన్నా... చెల్లని ఓటు వేసినా ఉన్నా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. ఇంకా కొంతమంది ఉన్నారని టాక్ నడుస్తోంది ఇలాంటి సమయంలో తేడా జరిగితే మాత్రం అధికార పార్టీకి పెద్ద దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అలాంటి ప్రమాదం రాకుండా అధికార వైసీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. నాలుగైదు మాక్ పోలింగ్‌లు నిర్వహించిది. తప్పు జరిగే అవకాశం లేకుండా అందరి ఎమ్మెల్యేలతో నేతలు మాట్లాడినట్టు సమాచారం.